మోర్తాడ్(బాల్కొండ) : మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారులోని వరద కాలువ అక్విడెక్ట్‌కు గండి పడటంతో వరద కాలువ నీరు పెద్దవాగులో కలిసిపోయింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఊహించని రీతిలో వరుద కాలువకు కింది భాగంలో గండి ఏర్పడింది. పెద్ద వాగు వద్ద నిర్మించిన అక్విడెక్టు ముగిసిన తర్వాత సిమెంటు గోడను నిర్మించారు. వరద కాలువ ప్రవాహం తట్టుకునే విధంగా నిర్మాణాన్ని 2020లో పూర్తి చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలు మిడ్ మానేరుకు వరద కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. గోదావరి నదిలోకి నీరు వదిలేందుకు బదులుగా వరద కాలువ ద్వారా విడుదల చేస్తుండడంతో ప్రవాహం విపరీతంగా పెరిగింది. వరదనీటి ఉధృతికి అక్విడెక్ట్ కింది భాగంలో గుంత ఏర్పడి నీరంతా పెద్ద వాగులోకి చేరింది. మొదట ఒడ్డువైపు నీటి ప్రభావం పెరిగిపోయింది. ఈ సమాచారం అందుకున్న చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రపాణి తదితరులు వరద కాలువకు నీటి మళ్లింపును ఆపివేశారు.నీటి ప్రవాహం ఉండడంతో జగిత్యాల వైపు వెళ్లిన నీరు కూడా గాండ్లపేట వైపు మళ్లింది.
వరద కాలువ అక్విడెక్ట్ నీరు పెద్దవాగులో ప్రవహిస్తున్న తీరుపై అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. వరద కాలువకు గండి ఏర్పడడానికి ప్రధాన కారణం గుర్తించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు వరద కాలువ విభాగం ఇంజనీర్లతో పాటు మోర్తాడ్ తహసీల్దార్‌తో మాట్లాడి కాల్వకు గండిపడటం వల్ల పంటలకు ఏమైనా నష్టం జరిగితే గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు.
వరద కాలువకు గండి