
ఈసీ మార్గదర్శకాలను పాటించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● మోస్రా, చందూర్, రుద్రూర్
మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
వర్ని(చందూరు)/ రుద్రూర్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నియమాలను అధికారులు, అభ్యర్థులు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం మోస్రా, చందూర్, రుద్రూర్ మండల కేంద్రాల్లో ఎంపీటీసీల నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమల య్యేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహా లున్నా జిల్లా స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు.నామినేషన్ల స్వీకరణ కేంద్రా ల్లో సరిపడా సిబ్బంది ఉన్నారా లేదా అని అడిగి తె లుసుకున్నారు. నోటీసు బోర్డుపై ప్రదర్శించిన నోటిఫికేషన్ పత్రాలను పరిశీలించారు. పొరపాట్లకు తావులేకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్‌లను ఏరోజుకు ఆరోజు నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి రిపోర్టు పంపాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రుద్రూర్ ఎంపీడీవో భీమ్‌రావ్, తహసీల్దార్ తారాబాయి తదితరులు ఉన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
వర్ని (చందూర్): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం చందూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, తేడా వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు తీసుకున్నారా లేదా అన్నది పరిశీలించారు.

ఈసీ మార్గదర్శకాలను పాటించాలి