
దుబ్బాక పాఠశాలలో సెల్‌ఫోన్ చిచ్చు
విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తాం
● విద్యార్థికి టీసీ ఇచ్చిన హెచ్‌ఎం
● నిరసన తెలిపిన బంజారా నాయకులు
నిజామాబాద్‌అర్బన్: పాఠశాలకు సెల్‌ఫోన్ తీసుకొచ్చాడని విద్యార్థికి టీసీ ఇచ్చిన ఘటన ధర్పల్లి మండలం దుబ్బాక ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. దసరా సెలవులకు ఒకరోజు ముందు ఈ ఘటన జరగగా గురువారం స్థానిక బంజారా సేవా సంఘం నాయకుల ఆందోళనతో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. పాఠశాలలో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించిన రోజు 8వ తరగతి విద్యార్థి సెల్‌ఫోన్ తీసుకొచ్చాడు. గమనించిన ప్రధానోపాధ్యాయురాలు శశికళ విద్యార్థి నుంచి ఫోన్ తీసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఫోన్ ఇవ్వాలని అడగగా, విద్యార్థి పాఠశాలకు ఫోన్ తీసుకురావడం సరైన విధానం కాదని, ఫోన్ ఇవ్వనంటూ చెప్పింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, హెచ్‌ఎం సెల్‌ఫోన్‌ను ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం ఆ విద్యార్థికి టీసీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న బంజారా సేవా సంఘం నాయకులు గురువారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యార్థి తల్లిదండ్రులను హెచ్‌ఎం దుర్భషలాడిందని, విద్యార్థికి టీసీ ఇవ్వడం సమంజసం కాదని, వెంటనే ఆమైపె చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ విషయమై హెచ్‌ఎం శశికళను వివరణ కోరగా.. విద్యార్థి మరోసారి ఇలాంటి తప్పిదం చేయకుండా బుద్ధి చెప్పేందుకు తల్లిదండ్రులు, గ్రామపెద్దల సమక్షంలో సెల్‌ఫోన్ ఇస్తానని తెలిపానని, అయినా వారు వినకుండా ఫోన్ ఇవ్వకుంటే తన పేరిట ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారని తెలిపారు. దీంతో తాను భయపడి ధర్పల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. విద్యార్థి ప్రవర్తనను దృష్టిలో పెట్టుకొని టీసీ మంజూరు చేసినట్లు తెలిపారు.
పాఠశాలకు సెల్‌ఫోన్ తీసుకురాకుండా విద్యార్థికి కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. టీసీ వాపస్ తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలికి ఆదేశాలిచ్చాం. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేవు.
– అశోక్, డీఈవో