
చేపల వేట.. ప్రాణాలతో ఆట
బాల్కొండ: మత్స్యకారుల అనాలోచిత చర్యలతో ప్రాణాలు పోతున్న తీరు కలవరానికి గురిచేస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల ఎదుట గోదావరిలో జాలర్లు ప్రాణాలు పోతున్నా వేట మానడం లేదు. గత శనివారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గేట్ల ఎదుట చేపల వేటకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు. అందులో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరొకరు నీటమునిగి కొట్టుకుపోయారు. ఈ ఘటన జరిగి వారం గడవకముందే మళ్లీ వరద గేట్ల ఎదుట గోదావరిలో బుధవారం జాలర్లు వేట సాగించారు. ఉదయం 9 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా ప్రవాహంలోనే చేపల వేట కొనసాగించారు. వరద గేట్ల ఎదుట చేపలు వేటాడకుండా ఎవరూ చర్యలు చేపట్టడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వరద గేట్ల ఎదుట ప్రవాహం సమయంలో చేపలవేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.