ఉపాధి ఉద్యోగులకు వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి ఉద్యోగులకు వేతన వెతలు

Sep 13 2025 2:37 AM | Updated on Sep 13 2025 2:37 AM

ఉపాధి ఉద్యోగులకు వేతన వెతలు

ఉపాధి ఉద్యోగులకు వేతన వెతలు

వేతనాలు సకాలంలో చెల్లించాలి..

ప్రభుత్వం స్పందించాలి..

మోర్తాడ్‌(బాల్కొండ): ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి ఉద్యోగులకు మూడు నెలల వేతనం చెల్లించాల్సి ఉండగా ఏపీవోలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీంతో పలువురు సిబ్బంది జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాల్కొండ ఉపాధిహామీ కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ధనుంజయ్‌(45) గురువారం పని చేసే చోటనే గుండెపోటుతో మరణించాడు. అతని మరణానికి సకాలంలో జీతాలు రాకపోవడంతోపాటు, ఆర్థిక ఇబ్బందులే కారణం అని సిబ్బంది చెబుతున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే ఉపాధి హామీ పథకం ఉద్యోగులు క్రమశిక్షణతో విధులను నిర్వహిస్తున్నా వేతనాల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్రం నిధులు ఇస్తున్నా..

ఉపాధిహామీ పథకం కింద నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఈ నిధులతో చేసిన పనులకు చెల్లింపులతో పాటు సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో పని చేస్తున్నా వేతనాల భారం మాత్రం కేంద్రంపైనే ఉంది. కేంద్రం చెల్లించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుండటంతో వేతనాల చెల్లింపులకు కటకట ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించి చేపట్టే పనులను ఈ పథకం ఉద్యోగులే పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదు. గ్రామాలలో ఏవైనా పనులు చేయాలన్నా, మౌళిక సదుపాయాలను కల్పించాలంటే ఉపాధి హామీ పథకం నిధులనే వినియోగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఉపాధిహామీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

జిల్లాలో ఉపాధిహామీ ఉద్యోగులు

ఏపీవోలు 20

కంప్యూటర్‌ ఆపరేటర్లు 36

ఇంజినీర్‌ కన్సల్టెంట్‌లు 11

టెక్నికల్‌ అసిస్టెంట్‌లు 67

ఫీల్డు అసిస్టెంట్‌లు 317

ఉపాధిహామీ పథకం కింద పని చేసే ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వేతనాల చెల్లింపుల విషయంలో జాప్యం చేయడం తగదు. కేంద్రం ఇచ్చే నిధుల నుంచే వేతనాలు చెల్లించాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు.

– నర్సయ్య, ఏపీవోల సంఘం అధ్యక్షుడు

ప్రభుత్వం ఉపాధి హామీ ఉద్యోగుల వేతనాల విషయంలో స్పందించాలి. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఉపాధి నిధులను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం వేతనాలు చెల్లించే విషయంలో జాప్యం చేయడం సరికాదు. ఎంతో మంది ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడుతున్నారు.

– సురేష్‌బాబు, ఉపాధి ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి

ఫీల్డు అసిస్టెంట్‌లకు 3 నెలలుగా, ఇతర ఉద్యోగులకు 2 నెలలుగా

అందని జీతాలు

సకాలంలో చెల్లించాలని

సిబ్బంది వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement