వీరుల విముక్తి పోరు | - | Sakshi
Sakshi News home page

వీరుల విముక్తి పోరు

Sep 17 2025 9:10 AM | Updated on Sep 17 2025 12:57 PM

నిజామ

నిజామాబాద్‌

నిజాం అరాచక పాలనపై 700 మందికి పైగా పోరాటం

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి కృష్ణమాచార్యులు నినదించింది ఇక్కడి జైలు నుంచే..

విముక్తి పోరులో ఎనలేని ఆర్యసమాజ్‌ పాత్ర

రాజకీయ ఖైదీల బొందల గడ్డగా పేరుగాంచిన ఇందూరు ఖిల్లా జైలు

 

 

 

 

నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ మరో 13 నెలల పాటు వీరోచిత పోరాటం చేయాల్సి వచ్చింది. జిల్లాలో ఏడు వందల మంది పోరాటంలో పాల్గొన్నారు. ఖిల్లా జైలు గోడలపై దాశరథి కృష్ణమాచార్య బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నినాదం నిజాం విముక్తి పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ పోరాటంలో ఆర్యసమాజ్‌ కీలక పాత్ర పోషించింది. జైలులో అనేక చిత్రహింసలను అనుభవించిన సమరయోధులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలంగాణ విముక్తి పోరాటంలో రాధాకృష్ణ మోదాని, సర్దార్‌ ప్రేమ్‌సింగ్‌, సర్దార్‌ వామాన్‌ సింగ్‌, నల్ల నర్సింహారెడ్డి తదితరులు ప్రాణాలు అర్పించారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: భారతదేశంలో భాగమయ్యేందుకు గాను తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబుపై ఇందూరు వీరులు చేసిన పోరా టం తిరుగులేనిది. జిల్లాకు చెందిన 700 మందికి పైగా ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. పలువురు అమరులయ్యారు. పోరాట ఫలితంగా 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ గడ్డపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటి ష్‌ వాళ్ల నుంచి స్వాతంత్య్రం లభించినప్పటికీ తెలంగాణ మాత్రం అదనంగా మరో 13 నెలల పాటు వీరోచిత పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిజాంకు వ్యతిరేకంగా రాసిన సాహిత్యం ప్రధాన పాత్ర పోషించింది. అనేక మంది కవులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నిజాం పాలకులు కొంతకాలం పాటు నిజామాబాద్‌ ఖిల్లా జైలు లో బంధించారు. వీరిలో దాశరథి కృష్ణమాచార్యు లు, వట్టికోట ఆళ్వారులు లాంటివారు ఉన్నారు. దాశరథి కృష్ణమాచార్య నిజామాబాద్‌ జైలులో మూడు నెలల పాటు ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో దాశరథి జైలు గోడలపై పళ్లు తో ముకునే బొగ్గుతో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాహిత్యాన్ని రాశారు. ‘నా తెలంగాణ కోటి అందా ల జాణ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గోడలపై రాశారు. ఈ నినాదం అప్పటి నిజాం విముక్తి పోరాటంలో తిరుగులేని విధంగా ఉద్యమాన్ని ముందుకు నడిపింది.

1939 సెప్టెంబర్‌ 2న ఇందూరు గంజ్‌ కమాన్‌ వద్ద ఒక అరబ్బు వ్యక్తి పోలీసు స్టేషన్‌ వద్ద

రాధాకృష్ణ మోదానిని కత్తితో పొడిచి చంపాడు.

1939 అక్టోబర్‌లో రజాకార్లు దసరా ఊరేగింపుపై దాడి చేసి సర్దార్‌ ప్రేమ్‌సింగ్‌, సర్దార్‌ వా మాన్‌సింగ్‌లను చంపారు.

1946 నవంబర్‌ 28న ప్లేగు శిబిరంలో నల్ల నర్సింహారెడ్డిని రజాకార్లు కాల్చి చంపారు.

1947 జూన్‌ 3న దత్తోపంత్‌ నాయక్‌ బాంబు పేలుడులో మరణించారు.

1931లో హైదరాబాద్‌ రాష్ట్రంలో సాగిన ‘సివిల్‌ డిస్‌ ఒబిడియెన్స్‌’ ఉద్యమంలో నల్ల నరసింహారెడ్డి అరెస్టయ్యారు. 1947లో హైదరాబాద్‌ రాష్ట్ర విలీనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దీంతో రజాకార్లు క్రూరంగా కాల్చి చంపారు. నిజామాబాద్‌లో నల్ల నర్సింహారెడ్డి పేరుతో ఒక వీధి ఉంది. జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం వారు నగరంలో ఈయన పేరిట ఒక స్థూపాన్ని ప్రతిష్ఠించారు.

ఇందూరులోని గాజుల్‌పేట్‌కు చెందిన బెల్లాల్‌ మాణిక్‌రెడ్డి నిజాం రజాకార్ల వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు. న్యాయవాద విద్యనభ్యసించిన మాణిక్‌రెడ్డి ఆర్యసమాజ్‌ బృందాలతో కలిసి ఇందూరు యువకులకు రాత్రి సమయాల్లో కర్రసాము, కరాటే, నాటు తుపాకీ వాడకం, బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారు. పోరాట యోఽ దులు కనిపిస్తే కాల్చేయమని నిజాం పోలీసులు ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో అనేకమంది వీరులకు తన పొలంలో, ఇంట్లో ఆశ్రయం కల్పించి వారి బాగోగులు, వారి కుటుంబాల బాగోగులు చూసుకున్నారు. అప్పట్లో మాణిక్‌రెడ్డి ఇల్లు స్వాతంత్య్ర ఉద్యమకార్లకు భోజన సత్రంగా ఉండేదని నాటి సమరయోధులు చెప్పేవారు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలు, సత్యాగ్రహ దీక్షల్లో తాను ముందుండి నాటి యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లారు. తరువాత కాలంలో ఎమర్జెన్సీ సమయంలోనూ మాణిక్‌రెడ్డి అప్పటి ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పోరాటాల్లో ముందున్నారు. చంపేస్తామని అప్పటి కాంగ్రెస్‌ నాయకులు బెదిరించినప్పటికీ వెరవలేదు.

మిఠాయి గంగారాం అనే స్వాతంత్య్ర సమరయోధుడు 1921లో నిజామాబాద్‌లో జన్మించారు. ని జాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈయన తన వృత్తినే వదిలేసి పాల్గొన్నారు. ఆనాటి ఉద్యమంలో వీరి పాత్ర అమోఘమైనది. ఎవరికీ జంకని వీరపురుషుడీయన అంటారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు నై జాం ప్రభుత్వం గంగారాంను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జైళ్లలో విడతలవారీగా ఉంచింది. 1947 జూలై 5 నుంచి 1948 అక్టోబర్‌ 7 వరకు జైలులో ఉన్నారు. జైలు లో అనేక అవస్థలు పడ్డారు. జైలు నుండి విడుదలైన తరువాత గంగారాం అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆర్యసమాజ్‌, విశ్వహిందూ పరిషత్‌ కార్యకలాపాల్లో, హనుమాన్‌ వ్యాయామశాల స్థాపన నిర్వహణలో చాలా కృషి చేశారు.

త్రయంబకరావు పాఠక్‌ 1920 డిసెంబర్‌ 1న ఇందూరులో జన్మించారు. తల్లిదండ్రులు అందూబా యి, రామచంద్రరావు. వ్యవసాయ కుటుంబం. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన పాఠక్‌ రజాకార్ల అరాచకాలను చూడలేకపోయారు. హృదయవిదారక ఘటనలు చూసి విప్లవ భావాలు పెంచుకున్నారు. ఆ కసాయివాళ్లను ఆయుధాలతోనే ఎదురించాలనుకుని, తన భార్య గాజులను అమ్మేసి హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌లో తన మిత్రుడు దత్తోపంత్‌తో బాంబులు తయారు చే యించారు. ఇందుకు సీహె చ్‌బీ విఠల్‌దాస్‌, కేవీ గంగాధర్‌లు సహకరించారు. అయితే బాంబులను రహస్యంగా చేరవేస్తున్నప్పుడు పేలుడు సంభవించి దత్తోపంత్‌ అనే సమరయోధుడు మరణించారు. ఇది పోలీసులకు తెలియడంతో అందరినీ బంధించి వేర్వేరు జైళ్లలో ఉంచారు. త్రయంబకరావును 1947 డిసెంబర్‌ 14న హైదరాబాద్‌ జైల్లో పెట్టారు. 1948 అక్టోబర్‌ 7న విడుదలయ్యారు. స్వాతంత్య్ర సమరంలో ఈయన పాత్రను గుర్తించిన భారత ప్రభుత్వం 1973 ఆగస్టు 15న తామ్రపత్రానిచ్చి గౌరవించింది. పాఠక్‌ ఆనాడు నిజామాబాద్‌ ప్రాంతంలో జరిగిన అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. హిందూ మహాసభకు జిల్లా కార్యదర్శిగా, ఆర్యసమాజ్‌ సభ్యులుగా వ్యవహరించారు. తరువాత భారత్‌ సేవక్‌ సమాజ్‌లోనూ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లోనూ, కాంగ్రెస్‌ పార్టీ, జనతా పార్టీలలో సభ్యులై ఎన్నో కార్యకలాపాలను నిర్వహించారు.

బృందాలుగా సత్యాగ్రహాలు..

ఇందూరులో 1934 ఆగస్టు 24న ఆర్యసమాజ్‌ కార్యకలాపాలు ప్రారంభించారు. మొదటి కార్యవర్గంలో ప్రధాన్‌గా నల్ల రుక్మారెడ్డి వకీలు, మంత్రిగా మునిపల్లె గంగారాం, కోశాధికారిగా గజవాడ మాణిక్యం నియమితులయ్యారు.

నిజాం విముక్తి పోరులో బృందాలుగా సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు. 1938, 1939లో బృందాలుగా ఏర్పడి పోరాటాలు చేశారు. మాణిక్యరెడ్డి, గడియారం సాంబయ్య, మునిపల్లె గంగారాం, రాధాకృష్ణ మోదా నిలు అరెస్టయ్యారు.

ఇందూరు జైలులో ఉప్పొంగిన దేశభక్తి..

1948 జనవరి 11న ఇద్దరు ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ కార్యకర్తలను రాజకీయ ఖైదీలున్న బ్యారక్‌ లో ఉంచారు. వీళ్లిద్దరూ స్టేట్‌ కాంగ్రెస్‌ ఖైదీలతో గిల్లికజ్జాలు పెట్టుకోసాగారు. జైలులో వందేమాతర గీతం ఆలపించకూడదని ఇద్దరు ఖైదీలు అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ వందేమాతరం ఆలపించడంతో ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌కు చెందిన ఖైదీలు 4వ బ్యారక్‌లో ఉన్న సత్యాగ్రహులను కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. అలారం మోగించారు. జైలు వార్డెన్లు, పోలీసులు, కొందరు బయటి వ్యక్తులు జైలులోకి చొచ్చుకొచ్చి దాడిలో పాల్గొన్నారు. అందరూ కలిసి సత్యాగ్రహులను, వందేమాతరం ఆలపించిన వారిని క్రూ రంగా కొట్టారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. తలలు పగిలాయి. కొందరి కాళ్లూ, చేతులు విరిగాయి. 150 మంది సమరయోధులు తీవ్రంగా గాయపడడంతో రక్తసిక్తమైంది. జలియన్‌ వాలాబాగ్‌ను తలపించిన ఈ ఘటనను దేశ వ్యాప్తంగా ఖండించారు. ఆ రోజుల్లో తెలంగాణ జైళ్లలోని వార్డెన్లందరూ రాష్ట్రం బయటి నుంచి వచ్చినవారే. దీంతో ఈ జైలు రాజకీయ ఖైదీలకు అగ్నిగుండంలాగా తయారైంది. అప్పట్లో ఈ జైలును ‘‘సియాసీ ఖైదియోంకా ఖబరస్తాన్‌’’ (‘‘రాజకీయ ఖైదీల బొందలగడ్డ’’) అనేవారు.

ఇందూరు గాంధీచౌక్‌లోని అమరవీరుల స్థూపం1
1/2

ఇందూరు గాంధీచౌక్‌లోని అమరవీరుల స్థూపం

జిల్లా కేంద్రంలోని ఖిల్లా ముఖద్వారం2
2/2

జిల్లా కేంద్రంలోని ఖిల్లా ముఖద్వారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement