
ఉద్యమాల పోరుగడ్డ ‘ఇందూరు’
మోర్తాడ్(బాల్కొండ): నిజాం రజాకార్ల గుర్రపు డెక్కల చప్పుళ్లకు వెరవని ధీరులు ఇందూరు ఉద్యమకారులు. 1947 ఆగష్టు 15న దేశమంతటా త్రివర్ణ పతాకం ఎగురవేయడానికి సన్నాహాలు జరుగుతుంటే నిజాం పాలనలో ఉన్న మనకు ఆ స్వేచ్ఛను రజాకార్లు హరించారు. మన సమరయోధులు మాత్రం రజాకార్ల ఆజ్ఞలను లెక్క చేయకుండా మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఫలి తంగా జైలు ఊచలు లెక్కించారు.
అహింస– హింస మార్గాల్లో..
మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో మన ప్రాంతానికి చెందిన కౌలాస్ రాజు దిలోప్ సింగ్ చూపిన పోరాట పటిమ, ఝాన్సీ లక్ష్మిబాయ్ ప్రదర్శించిన తెగువతో తెలంగాణకు విముక్తి కోసం కొందరు సాయుధ పోరాటానికి నాంది పలుకగా, మరికొందరూ గాంధీ బాటలో సత్యాగ్రహం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోశారు. ఇలా తెలంగాణ విముక్తి కోసం హింస, అహింస మార్గాల్లో వేరువేరుగా పయనించిన యోధులకు పుట్టినిల్లుగా ఇందూరు గడ్డ నిలుస్తోంది.
పల్లెలపై దాడులు చేస్తు అమాయక ప్రజల ధన, మాన ప్రాణాలను హరిస్తున్న రజాకార్ల గుంపుపై మోర్తాడ్ జమీందార్ రుక్మారెడ్డి ఫిరంగులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో నిజాం పాలకులు అతడిని ఇనుప సంకెళ్లతో బంధించి జైళ్లో ఉంచారు. అలాగే ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చౌట్‌పల్లి నారాయణరెడ్డి ఆర్య, చౌట్‌పల్లి శ్రీనివాస్‌రెడ్డి, పడిగెల హన్మాండ్లు, నారాయణ లింగారెడ్డి, నీలకంఠ నారాయణ, పడకల్ శ్రీనివాస్‌రెడ్డి, శంభులింగం, లక్ష్మాగౌడ్, బ్రహ్మయ్య, వెంకటస్వామి, బొంబాయి నర్సింహారెడ్డి, నర్సింహారావు, నరసింహాశాస్త్రి, కొండా నారాయణ, ఉప్పు లక్ష్మయ్య, హన్మంత్‌రెడ్డి, రంగారెడ్డిలు రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమానికి ప్రభావితులైనారు.
నిజాం రజాకార్లపై తెగింపుతో
ప్రతిదాడులు చేసిన
జిల్లా ఉద్యమకారులు ఎందరో...
నేడు నిజాంపాలన నుంచి
తెలంగాణ విముక్తి పొందిన రోజు