సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పార్టీ సీనియర్ నేత షబ్బీర్‌అలీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నెల 16న మొదటిసారి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు మంగళవారం తెలిపారు. స్వాగత యాత్ర నగర శివారులోని బోర్గాం(పి) నుంచి ప్రారంభమై వినాయక్‌నగర్, పులాంగ్, గోల్‌హనుమాన్ మందిరం, పెద్దబజార్, నెహ్రూ పార్క్, తిలక్ గార్డెన్, ఎల్‌ఐసీ చౌరస్తా మీదుగా ప్రగతినగర్‌లోని మున్నూరుకాపు కల్యాణ మండపం వరకు సాగుతుందని పేర్కొన్నారు. ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
16న ‘మార్కెట్’ బంద్
సుభాష్‌నగర్ : దేశవ్యాప్త కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 16న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం లేదని మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. 17న శనివారం, 18న ఆదివారం కావడంతో పసుపు క్రయవిక్రయాలు జరపబోమని పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి పసుపు వ్యాపార లావాదేవీలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. అలాగే పసుపు సీజన్ కావడంతో మార్కెట్‌యార్డులో సమయవేళలను మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. మార్కెట్‌యార్డులోనికి రైతుల పసుపు పంట ఉత్పత్తులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. విన్నర్ లిస్టు 5వేల బస్తాల వరకు ఉంటే మధ్యాహ్నం 2 గంటలకు, 10వేల బస్తాల సరుకు ఉంటే 3 గంటలకు, 15వేల బస్తాల సరుకు ఉంటే సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని, తదుపరి కాంటాలు నిర్వహిస్తామన్నారు.
అధిక మోతాదులో యూరియా వాడొద్దు
వర్ని : రైతులు అధిక మోతాదులో యూరి యా వాడొద్దని జిల్లా వ్యవసాయ అధికారి మాజిద్ హుస్సేన్ సూచించారు. యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఆశించే అవకాశం ఉందన్నారు. మంగళవారం వర్నిలోని గ్రో మోర్ ఎరువుల దుకాణాన్ని ఆయన పరిశీ లించారు. పీవోస్ మిషన్ల ద్వారానే ఎరువు లు విక్రయించాలని సూచించారు. అంతకు ముందు తగిలేపల్లి శివారులో పంటల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఏవో నగేశ్‌రెడ్డి, ఏఈవో అరుణ్ పాల్గొన్నారు.
అల్జాపూర్‌పై
క్రమశిక్షణ చర్యలు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : బీజేపీ సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్‌పై పార్టీ నాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా అల్జాపూర్ వ్యహరించినట్లు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు కులాచారి దినేష్, మోరేపల్లి సత్యనారాయణలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డికి ఫిర్యాదులు చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై నేరుగా విమర్శలు చేయడం పట్ల వీరు ఫిర్యాదులు చేశారు. పైగా జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఎంపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేశారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పైగా ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా పురిగొల్పినట్లు ఫిర్యాదులో వివరించారు. పార్టీ అధినాయకత్వంతో సంబంధం లేకుండా తనకు తానే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించడం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో పార్టీ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
మున్సిపల్ అసిస్టెంట్
కమిషనర్ బదిలీ
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ ము న్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వచ్చాయి. ఆయన మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా వెళ్తున్నారు. మహేశ్వర్‌రెడ్డి ఇక్కడ ఆరు నెలల పాటు విధులు నిర్వహించారు.


