జిల్లాలో ఇప్పటికీ భూపట్టాలందని ఊళ్లు అభివృద్ధికి నోచని గిరిగ్రామాలు ‘గోదావరి’ దాటని పర్యాటకాభివృద్ధి నేడు మంత్రులు పొంగులేటి, జూపల్లి పర్యటన ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష
అమాత్యుల రాక..
నిర్మల్: తరాలు గడిచినా భూసమస్యలు పరిష్కా రం కాకపోవడంతో జిల్లాలో పునరావాస గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములున్నా పట్టాలు, పాసు బుక్కులు లేక ఇబ్బంది పడుతున్నా రు. జిల్లా అధికారుల నుంచి సీసీఎల్‌ఏ వరకు చె ప్పులరిగేలా తిరిగినా సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణ చాంద, సోన్ మండలాల్లోని పలు పునరావాస గ్రా మాల్లో ఈ సమస్య ఏళ్లుగా వేధిస్తోంది. పెంబి, కడెం, ఖానాపూర్, మామడ, సారంగపూర్ తదితర అటవీ మండలాల్లో ఆదివాసులు, గిరిజనులు సరైన రోడ్లు, వాగులపై వంతెనలు, కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎకై ్స జ్, సాంస్కృతిక శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాంటి సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
నేడు మంత్రుల సమీక్ష
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతోపాటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం ఉదయం నిర్మల్‌కు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌కు హెలికాప్టర్‌లో చేరుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
పునరావాస గ్రామాల్లో భూసమస్యలు
ఎస్సారెస్పీ ముంపు కారణంగా ఏర్పడిన పునరావాస గ్రామాల్లో ఇప్పటికీ భూసమస్యలు కొనసాగుతున్నాయి. లక్ష్మణచాంద మండలంలోని కంజర్, పొట్టపల్లి(కె), పొట్టపల్లి(బి), సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామాల్లో భూములు కేటాయించినా చాలామందికి పట్టా, పాసుపుస్తకాలు రాలేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఆ భూములు ప్రభుత్వ భూములు, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్‌గా నమోదై ఉన్నాయి. పొట్టపల్లి (కె)లో 30 సర్వే నంబర్లు, పొట్టపల్లి (బి)లో 76 సర్వే నంబర్లు ప్రభుత్వ భూములుగా చూపుతున్నాయి. న్యూకంజర్ గ్రామం మొత్తం ప్రభుత్వ భూమిగానే ఉంది. న్యూవెల్మల్‌లో 1,241 ఎకరాల 29 గుంటల భూమి సమస్యగా మిగిలింది. అక్కడ సేత్వార్ ఇంప్లిమెంట్ కొందరికే అయింది. వారికి కూడా కొత్త పట్టా, పాసుబుక్ రాలేదు. 81 మంది రైతులకు పట్టాబుక్ రాలేదు. 54 మందికి సేత్వార్ ఇంప్లిమెంట్ కాకపోవడంతో పాటు పాసుపుస్తకం కూడా లభించలేదు. ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కాలేదు. రెవెన్యూ మంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అందని డబుల్ బెడ్‌రూం ఇళ్లు
గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు చాలామంది లబ్ధిదారులకు ఇప్పటికీ అందలేదు. నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) రోడ్డులో నిర్మించిన 600 ఇళ్లు అలాగే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మరో 200 ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ ఉపాధి కోసం కారు నడుపుకుంటున్న పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదు. గతంలో ప్రభుత్వ లబ్ధి పొందారని కొందరికి కూడా రావడం లేదు.
పుష్కరాలకు శాశ్వత ఏర్పాట్లు..
గోదావరి పుష్కరాలు 2027, జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కుంభమేళా తరహాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిర్వహణకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రతిపాదించారు. అయితే 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల్లో తాత్కాలిక ఏర్పాట్లే చేస్తున్నారు. గోదావరి పరీవాహక జిల్లాలో శాశ్వత పనులు చేపట్టాలన్న డిమాండ్ ఉంది. స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునే గదులు, శాశ్వత టాయిలెట్లు, రోడ్లు, తాగునీటి వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రారంభించే అభివృద్ధి పనులు..
సమీకృత కలెక్టరేట్‌లో మంత్రులు రూ.23.35 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి బాసరలో రూ.14 కోట్లతో చేపట్టనున్న పనులు, కడెం, బాసర, ఖానాపూర్ మండలాలకు సంబంధించి రూ.2.25 కోట్ల చొప్పున తహసీల్దార్ కార్యాలయ భవనాలు, ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (రూ.1.40 కోట్లు), లోకేశ్వరం, కుభీర్, ఓలా, కడ్తాల్, బోరిగాం(లక్ష్మణచాంద), గొడిసిర్యాలలో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న పీహెచ్‌సీ సబ్ సెంటర్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
పర్యాటకాన్ని పట్టించుకోవాలి..
తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే గోదావరి నదికి బాసర తొలి స్వాగతం పలుకుతోంది. బాసర నుంచి దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ వరకు దాదాపు 150 కి.మీ. పొడవునా నిర్మల్ జిల్లా సరిహద్దుగా సాగుతోంది. ఈ మార్గంలో బాసర జ్ఞానసరస్వతీ మాత ఆలయం, లోకేశ్వరం మండలంలో బ్రహ్మేశ్వరం, దిలావర్‌పూర్ మండలంలో సాంగ్వి పోచమ్మ, గాంధీనగర్, లెఫ్ట్ పోచంపాడ్ వద్ద ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్, డ్యామ్ కింద రామాలయం, మొసళ్ల మడుగు, మాదాపూర్ ఘాట్ వద్ద స్వర్ణ–గోదావరి సంగమం, సోన్ వద్ద రాళ్లతో నిర్మించిన పాత వంతెన, పుష్కరఘాట్లు, మామడ మండలం పొన్కల్ వద్ద నాగమ్మ ఆలయం, ఖానాపూర్‌లో సదర్‌మాట్ అందాలు వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి. నిర్మల్‌లోని చారిత్రక కట్టడాలు, ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ను పర్యాటకపరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.


