లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం రైతులు సాగు చేస్తు న్న పంటల దిగుబడులు అమ్మే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేను చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా వా నాకాలంలో జిల్లాలోని రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
వాలంటీర్ల ద్వారా నమోదు..
జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు సంబంధిత క్లస్టర్ ఏఈవోల ఆధ్వర్యంలో పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. మొదట ఈ పనిని ఏఈవోలు చేయాలని ప్రభుత్వం సూచించినా, వారికి ఇతర పనులు ఉండటంతో వాలంటీర్లను నియమించారు. వలంటీర్లు ప్రతీ రైతు పొలానికి నేరుగా వెళ్లి సర్వే నంబర్లు, సాగు చేస్తున్న పంట రకం, విస్తీర్ణం వంటి వివరాలను నమోదు చేస్తూ రైతు ఫొటోను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రతీ సర్వే నంబర్‌కు ప్రభుత్వం రూ.7 చొప్పున వాలంటీర్లకు చెల్లిస్తోంది.
జిల్లాలో పంటల సాగు వివరాలు
ఈ వానాకాలంలో జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 4.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సుజాత తెలిపారు. ఇప్పటి వరకు 3,33,792 ఎకరాల్లో డిజిటల్ నమోదు పూర్తయిందని, కొన్ని సర్వే నంబర్లు తప్పుగా ఉండటం, మ్యాపింగ్ సరిగా లేకపోవడం వంటి కారణాలతో పూర్తి కాలేదని పేర్కొన్నారు. మిగిలిన ప్రక్రియ మూడు నుంచి నాలుగు రోజుల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు.
సాగుచేసిన ప్రధాన పంటల వివరాలు..
వరి 1,36,000 ఎకరాలు
సోయాబీన్ 1,08,000 ఎకరాలు
పత్తి 1,63,000 ఎకరాలు
మొక్కజొన్న 14 వేల ఎకరాలు
పసుపు 5 వేల ఎకరాలు
త్వరలో పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న పంటల డిజిటల్ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకు పూర్తి కావాల్సి ఉంది. కొన్ని ఇబ్బందులతో పూర్తి కాలేదు. రానున్న నాలుగు ఐదు రోజులలో సర్వేను పూర్తి చేస్తాం. – సుజాత, ఇన్‌చార్జి డీఏవో


