నర్సాపూర్ (జి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు 24/7 పనిచేస్తున్నారని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. నర్సాపూర్(జి) మండలం కుస్లీ గ్రామంలో మంగళవారం ఉదయం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివి, పెండింగ్ చలాన్‌లు ఉన్న 43 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్ చలనాలు చెల్లించిన వారి వాహనాలు యజమానులకు తిరిగి ఇచ్చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు, సోషల్ మీడియా లింకులు, ఆన్‌లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గుడుంబా, కల్లు వంటి మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు కుటుంబాలు, సమాజాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నార్వాడి ప్రవీణ్ పాటిల్, ఉప సర్పంచ్ అల్లూరి రాజు, నిర్మల్ రూరల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్సైలు గణేశ్, శ్రీకాంత్, రవీందర్, లింబాద్రి, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


