● అభివృద్ధికీ ‘ఏలేటి’ అడ్డు ● మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్: జిల్లాలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న, జొన్న చివరి గింజ వరకూ కొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇందుకు కలెక్టర్, అధికారులూ శ్రమించారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం తాము కష్టపడుతుంటే, తరుగు పేరిట ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి రూ.కోట్లు దోపిడీ చేశారని సంచలన ఆరోపణ చేశారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. జిల్లాలో ఈసారి ధాన్యంతో సమానంగా మక్కలు కూడా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. రెండు పంటలకు ఒకేసారి రావడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తరు గు పేరిట ప్రతీ సంచికి నాలుగైదు కిలోల చొప్పున దోచుకున్నారని మండిపడ్డారు. మొత్తం 18,92,926 ధాన్యం సంచుల నుంచి రూ.17.41 కోట్లు మింగేశారని ఆరోపించారు. రైతుల గోస ఎమ్మెల్యేకు తగులుతుందన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ నిర్మాణాలకు అడ్డుపడుతున్నారని విమర్శించా రు. ప్రజలందరూ ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలని, ఇష్టానుసారంగా ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ జిల్లా మీదుగా రైలు తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. డీసీసీబీ మాజీ వైస్‌చైర్మన్ రఘునందన్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి పాల్గొన్నారు.


