బెల్లంపల్లి:ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) గురుకులాలు, రెగ్యులర్ జూనియర్ కళాశాలలు, వృత్తి విద్య సైనిక కళాశాలల్లో 2026–2027 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది పదో తరగతి మార్కుల ప్రాతిపదికన ప్రవేశం కల్పించగా ఈసారి మాత్రం పూర్వ పద్ధతిని అనుసరించనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ప్రతి భావంతులైన విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నా రు. ప్రవేశ పరీక్షకు సంబంధించి టీజీఎస్‌డబ్ల్యూఆర్– ఆర్‌జేసీసెట్–2026 నోటిఫికేషన్ విడుదలైంది.
ఈనెల 25 తుది గడువు
సంక్షేమ గురుకుల సీవోఈలు, రెగ్యులర్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించనున్న పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హులు వీరే..
2025–26 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఐసీఎస్‌ఈ/సీబీఎస్‌ఈ ద్వారా పదోతరగతి లేదా 2026 మార్చిలో ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.
మే 13న ప్రవేశ పరీక్ష
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు నిర్దేశించిన కేంద్రాల్లో హాజరుకావాల్సి ఉంటుంది. ఏ పరీక్ష కేంద్రం కేటాయిస్తారో పరీక్షకు ముందస్తుగా వెల్లడిస్తారు.
తొమ్మిది ప్రీమియర్ సీవోఈలు
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 9 ప్రీమియర్ సీవోఈ కళాశాలలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి బాలురు, బాలికల కళాశాలలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ బాలురు, రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలురు, ఇబ్రహీంపట్నంలో బాలురు, కరీంనగర్ జిల్లా అల్గునూరులో బాలికలు, హైదరాబాద్ జిల్లా మహేంద్ర హిల్స్‌లో బాలికలు, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో బాలికల ప్రీమియర్ సీవోఈ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సీటు సాధించిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ అంశాల్లో విద్యాబోధన ఉంటుంది. ఇతర నాన్ ప్రీమియర్ సీవోఈలు, రెగ్యులర్ జూనియర్, వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో అత్యుత్తమ విద్యాబోధన చేసివిద్యార్థులను ప్రతిభావంతులుగా
తీర్చిదిద్దుతారు.
ఉమ్మడి జిల్లాలో....
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ నాన్ ప్రీమియర్ సీవోఈ జూనియర్ కళాశాలలు రెండు ఉన్నాయి. బెల్లంపల్లిలో బాలురు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాలికల సీవోఈ కళాశాలలు పని చేస్తున్నాయి. అదే తీరుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.


