మంచిర్యాలఅర్బన్/లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. అయినా ఏటా ప్రవేశాలు తగ్గుతున్నాయి. ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కూడా తమ వంతు చర్యలు చేపడుతున్నారు. బడిబాట కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు జరిగేలా చూస్తున్నారు.
పీఎంశ్రీ పాఠశాలల్లో...
ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ )పాఠశాలల్లో ప్రవేశాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గుతుండడంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జూన్‌లో నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 2026–2027 విద్యా సంవత్సరం బడుల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇంటింటా ప్రచారం, అవగాహన సదస్సులు, కరపత్రాల పంపిణీ, ఫ్లెక్స్‌బ్యానర్ల ప్రదర్శన నిర్వహించేందుకు ఒక్కో పాఠశశాలకు రూ.4,691 చొప్పున నిధులు మంజూరయ్యాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎంసీ సభ్యుల సహకారంతో అడ్మిషన్ల డ్రైవ్ నిర్వహించనున్నారు.
ముందస్తు ప్రవేశాలతో..
పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ముందస్తు అడ్మిషన్లకు శ్రీకారం చుట్టారు. పాఠశాలలో చేరితే కలిగే ప్రయోజనాలు, విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆధునిక బోధనా పద్ధతులు, స్మార్ట్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయాలు, క్రీడా సౌకర్యాలు, సురక్షిత పారిశుద్ధ్యంపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ‘మాబడిలో చేరండి’ అంటూ టీచర్లు ఇంటింటా ప్రచారం చేపట్టారు.
ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు,
మంజూరైన నిధులు
జిల్లా పాఠశాలలు నిధులు
(రూ.ల్లో)
నిర్మల్ 12 56,292
కుమురంభీం 13 60,983
ఆదిలాబాద్ 15 70,365
మంచిర్యాల 16 75,056


