యాపాలగూడ నుంచి నిర్మల్‌దాకా.. 75 కి.మీ. నడిచి వచ్చి.. ‘ప్రజావాణి’ వినిపించి సీపీఎం ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర స్పందించి, కమిటీ వేస్తామన్న కలెక్టర్
నిర్మల్:‘గూడెం దాటిపోవాల్నంటే.. వాగు దాటాలె. పిల్లాజెల్లతోనే పాణాలు చేతుల పట్టుకుని ఆ నీళ్లల దాటుకుంటూ పోతున్నం. ఆనాకాలమైతే మా గోస ఓళ్లకు చెప్పుకోవాల..! ఇట్ల ఎన్నో కష్టాలున్నయ్. ఇంకెన్నేండ్లిట్ల బతకాల..!’ అంటూ పెంబి మండలం యాపాలగూడ గ్రామస్తులు తమ గోస వినిపించారు. పెంబి మండలంలో కష్టాలు పడుతున్న పలు గూడేలు తమ కష్టాలను ఏకరువు పెట్టేందుకు ఏకంగా 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాకేంద్రానికి నడిచివచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణికి చేరుకుంది. అంతదూరం నుంచి ఎండలో నడిచి వచ్చిన ఆ గిరిజనుల గోడు వినేందుకు స్వయంగా కలెక్టర్ అభిలాషఅభినవ్ వారివద్దకు వచ్చారు. సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
సీపీఎం ఆధ్వర్యంలో..
పెంబి మండలంలోని అటవీ, మారుమూల గ్రామాలు, గూడేలా సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, విద్యుత్, తాగునీరు, ఆరోగ్యం తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 21న యాపాలగూడ నుంచి జిల్లాకేంద్రానికి పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో మండలంలోని యాపాలగూడ, చాక్‌రేవు, వస్‌పల్లి, ధోందరి, రాంనగర్, కొలాంగూడ(జంగుగూడ), రాముగూడ, సత్తుగూడ, గుమ్మెనకొలాంగూడ, రావిగూడ(కొసగుట్ట),యాపల్‌గూడ(నాయక్‌పోడ్‌గూడ) తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మూడోరోజైన సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమానికి చేరుకున్నారు.
అభివృద్ధికి అడ్డంకులు..
పెంబి మండలంలోని గిరి ప్రాంతాల్లో అభివృద్ధికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, ఇక్కడి ప్రజలు పడుతున్న సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. పాదయాత్రగా నిర్మల్‌కు చేరుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. పెంబి మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే 75కి.మీ. పాదయాత్ర చేపట్టామని చెప్పారు. దొత్తివాగు, కడెంవాగులపై వంతెనలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు, నిర్మాణాలకు అటవీ అనుమతులు ఇవ్వాలన్నారు. అన్ని గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వడంతోపాటు పెంబిలో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. మండలంలోని గ్రామాలవారీగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌కు విన్నవించారు.


