ఇంద్రవెల్లి/బజార్‌హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి మండలంలోని ఇన్కార్‌గూడలో షేక్ జాకీర్, రేఖాబాయి, అనిల్‌రెడ్డితో పాటు పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటలు నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్‌యార్డులో కంది పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. బజార్‌హత్నూర్‌లో సల్ల ముత్తన్న, సల్ల సాయికి చెందిన మొక్కజొన్నపంట నేలకొరిగింది. కొలారిలో బుర్కులే నిర్మల, సల్ల రాములు, షెడ్కే మంతబాయి, షెడ్కె గంగా, తొర్కడే శకుంతల, బిస్సే సంగీత, డోలే అంజనాబాయి, దేశముక్ రుక్మబాయి, టార్పే వనిత, రేకేవాడ్ కుష్మాలకు చెందిన ఇళ్ల పైకప్పులు ఎగరిపడ్డాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ తీగలపై చెట్టు పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.


