‘అడెల్లి’ ఆదాయం రూ.53.97 లక్షలు | - | Sakshi
Sakshi News home page

‘అడెల్లి’ ఆదాయం రూ.53.97 లక్షలు

Mar 25 2026 6:59 AM | Updated on Mar 25 2026 6:59 AM

సారంగపూర్‌: ఉత్తర తెలంగాణ ప్రజల వరప్రదాయినిగా పేరుగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ శాఖ నిర్మల్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగు రవికిషన్‌గౌడ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ భోజాగౌడ్‌ ఆధ్వర్యంలో లెక్కించారు. అమ్మవారికి భక్తులు నగదు రూపేణా సమర్పించిన రూ.53, 97,520 నగదు, 125.49 గ్రాముల మిశ్రమ బంగారం, 3 వేల గ్రాముల మిశ్రమ వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కె.భూమయ్య తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దండు సాయన్న, ఎస్సై శ్రీకాంత్‌, పాల్గొన్నారు.

గూడెం ఆలయ హుండీ లెక్కింపు

దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి 2025 డిసెంబర్‌ 20 నుంచి 2026 మార్చి 23 హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఈవో శ్రీనివాస్‌ తెలిపారు. 94 రోజులకు రూ.6,67,205 ఆదాయం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ నవీన్‌ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అర్చకులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

బడ్జెట్లో విద్యారంగానికి నిరాశే

నిర్మల్‌ఖిల్లా: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపుల్లో నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌)జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి విజయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ బి.వెంకటేశ్వర్లుకు మంగళవారం ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో కేవలం 26 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొందని గుర్తుచేశారు. దానికి భిన్నంగా కేవలం 8 శాతం మాత్రమే కేటాయింపులు జరపడం ఆక్షేపణీయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్షీణిస్తోందని, విద్యా ప్రమాణాలు సైతం పడిపోతున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, సౌకర్యాల కల్పనకు క్షేత్రస్థాయిలో నిధులు అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏలు, రిటైర్‌ అయిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్‌ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని గుర్తుచేశారు. విద్యారంగానికి బడ్జెట్‌లో 20 శాతం కేటాయింపులు చేయాలన్నారు. విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, రెగ్యులర్‌ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నగదు రహిత వైద్య సదుపాయాన్ని ఉపాధ్యాయులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement