క్రాప్‌లోన్ ఇవ్వట్లే..
పునరావాసం కింద ఇచ్చిన భూములకు అందని పట్టాలు పంట రుణం ఇచ్చేందుకు బ్యాంకుల నిరాకరణ గిరిజనులకు తప్పని తిప్పలు
కడెం: పులి ఆవాసం కోసం ఉన్న ఊరిని వదిలివెళ్లి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పునరావాస గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పరిహారంలో భాగంగా అందించిన వ్యవసాయ భూములకు నేటికీ పట్టాలు ఇవ్వకపోవడంతో అట్టి భూములు సాగుకు నోచుకోవడం లేదు. ఇటీవలే పట్టాలిస్తున్నామని రెవెన్యూ అధికారులు హడావుడి చేసినప్పటికీ అందించడంలో జాప్యం జరుగుతుండడంతో గిరిజనులు సాగుకు ముందడుగు వేయలేకపోతున్నారు. పట్టా పాస్ పుస్తకాలు, భూములు సాగులో లేకపోవడంతో పంటరుణం ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు నిరాకరిస్తున్నారు.
పట్టా చేతికందలే
కవ్వాల్ టైగర్‌జోన్‌లోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను 2024 ఏప్రిల్‌లో మండలంలోని కొత్తమద్దిపడగ సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీకి తరలించారు. పునరావాసంలో భాగంగా ఆప్షన్–1 ఎంచుకున్న 94 మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పెత్తర్పు సమీపంలో ఒక్కొక్కరికి 2.32 ఎకరాల చొప్పున సాగు భూమి ఇచ్చారు. కానీ వాటికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. గతంలో పునరావాస గ్రామస్తులు ఆందోళన చేపట్టగా రెవెన్యూ అధికారులు పట్టాలు అందజేస్తామని హడావుడి చేశారు. కా నీ నెలలు గడుస్తున్నా నేటికీ పంపిణీ చేయలేదు.
రుణం ఇస్తలేరు..
పునరావాస గిరిజనులకు అప్పగించిన భూమి పట్టా వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. పట్టా పాస్ పుస్తకాలు, భూమి సాగులో లేకపోవడంతో బ్యాంక్ అధికారులు క్రాప్‌లోన్ ఇవ్వడం లేదు. ఆన్‌లైన్ కాపీపై తహసీల్దార్‌తో సంతకం చేయించి ఇస్తామని చెప్పినా ఒప్పుకోవడం లేదని, బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ చెప్తే ఇస్తామని అంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటి వరకు మూడు పంటలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
పట్టా బుక్ ఇయ్యలేదు
మాకు పునరావాసంలో భాగంగా అందించిన భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. రుణం తీసుకోవాలని బ్యాంకుకు వెళ్తే పట్టా పాస్‌బుక్‌లు లేకుంటే మీ భూములకు లోన్ ఇవ్వమని అధికారులు తిరస్కరిస్తున్నారు. – దేవురావు
ఉన్నతాధికారులు స్పందించాలి
పునరావాసంలో భాగంగా మాకు అందించిన భూములకు రెవెన్యూ పట్టాలిస్తామని కలెక్టర్, ఇతర అధికారులు చెప్పినా నేటికీ ఇవ్వలేదు. బ్యాంక్‌లో రుణం తీసుకుని సాగు పనులు చేపడుదామంటే అధికారులు లోన్ ఇస్తలేరు. ఉన్నతాధికారులు స్పందించి పంటరుణం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– కోవ ప్రవీణ్
ఆందోళన చెందవద్దు
పునరావాస గ్రామస్తులకు పరిహారంలో భాగంగా పంపిణీ చేసిన భూములకు పట్టా పాస్ పుస్తకాలు అందించడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ వారికి ఇబ్బందులు లేకుండా బ్యాంక్ రుణం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందవద్దు.
– శివకుమార్, ఎఫ్‌డీవో, ఖానాపూర్
క్రాప్‌లోన్ ఇవ్వట్లే..
క్రాప్‌లోన్ ఇవ్వట్లే..


