హిందూ ధర్మ పరిరక్షణకు కృషి
కుంటాల: సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి సూచించారు. మండలంలోని లింబా(బి)లో ఆదివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని గురుదేవ దత్త సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దత్తమహా యజ్ఞంలో పాల్గొని భక్తులకు ప్రవచనాలు బోధించారు. భారతీయ సంస్కృతి శ్రేష్టమైందని, పాశ్ఛాత్య దేశాలు మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతున్నాయన్నారు. గోమాత, రైతును రక్షించుకుంటే మనమంతా సుభిక్షంగా ఉంటామన్నారు. ధర్మాన్ని కాపాడితే మనల్ని రక్షిస్తుందన్నారు. మహాదత్త యజ్ఞంలో పలువురు జంటలు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆదుముల్ల సుహాసిని రవి, వీడీసీ చైర్మన్ కేశవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.


