ప్రభుత్వ విద్యార్థులకు కార్పొరేట్ లుక్
2026–27 విద్యాసంవత్సరం నుంచి స్కూల్, హాస్టల్ కిట్లు ఉమ్మడి జిల్లాలో చలి నుంచి రక్షణకు ప్రత్యేక వస్త్రం 22 రకాల వస్తువులతో అందుబాటులోకి రానున్న కిట్లు
నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే లక్షల మంది విద్యార్థులకు రా నున్న 2026–27 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్, హాస్టల్ కిట్లు అందజేయనుంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ బడుల విద్యార్థులూ సమగ్రంగా సన్నద్ధంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది.
ప్రాథమిక కసరత్తు పూర్తి..
ఈ కిట్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తయింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల స్కూల్, హాస్టల్ కిట్లలో చేర్చే వస్తువులు, వాటి కొ నుగోలు విధానాలు (ప్రొక్యూర్‌మెంట్)పై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం, చదువుపై ఆసక్తిని మరింతగా పెంపొందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
కార్పొరేట్ లుక్‌తో విద్యార్థులు..
ఇకపై ప్రభుత్వ బడి పిల్లలంటే కేవలం పుస్తకాల సంచి మాత్రమే కాదు.. మెడలో టై, ఐడీ కార్డు, కాళ్లకు మెరిసే బూట్లతో ప్రైవేట్ స్కూ ల్ పిల్లలకు దీటుగా కనిపించనున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వా సం పెంచి, పాఠశాలల హాజరు శాతా న్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులూ కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల మాదిరిగా స్కూల్ బ్యాగ్, బూట్లు, టై, ఐడీ కార్డు వంటి అన్ని సౌకర్యాలతో బడికి వెళ్లాలన్న ఆలోచనతో ఈ కిట్ల రూపకల్పన జరిగింది. బడులను ఆధునికంగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, డ్రాప్‌అవుట్లను తగ్గించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది.
స్కూల్ కిట్‌లో ఉండేవి ఇవే..
స్కూల్ కిట్ (పాఠశాల విద్యార్థులకు): పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, మూడు జతల ఏకరూప దుస్తులు(యూనిఫాం), నాణ్యమైన స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డు మరియు పెన్సిళ్ల సెట్ ఉంటాయి.
హాస్టల్ కిట్ (గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులకు): పైన పేర్కొన్న వస్తువులతోపాటు అదనంగా దుప్పటి, స్పోర్ట్స్ డ్రెస్, పీటీ డ్రెస్, బ్లేజర్ వంటి 22 రకాల వస్తువులను ప్రభుత్వం అందజేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలు, విద్యార్థుల వివరాలు..
జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య
ఆదిలాబాద్ 1,279 65,874
కుమురంభీం 1,148 42,478
మంచిర్యాల 847 36,937
నిర్మల్ 842 52,667
ఈ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ప్రత్యక్ష లాభం చేకూరనుంది. ఇప్పటికే మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు ఉపాధ్యాయ నియామకాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల అవసరాలపై దృష్టి పెట్టడం ప్రభుత్వ బడులకు కొత్త ఊపునిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు మెరుగుపడే దిశగా ఈ నిర్ణయం మైలురాయిగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చలితీవ్రత నేపథ్యంలో ప్రత్యేక వస్త్రం...
నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ వంటి నూతన జిల్లాలతో కూడిన ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో శీతాకాలంలో చలి తీవ్రంగా ఉంటుంది. విషయాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. చలిని తట్టుకునేలా శాలువా తరహాలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని కిట్లలో అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.


