నిర్మల్ ఉత్సవాలకు స్వాగతం
నిర్మల్: నేటితరానికి తన చరిత్రను చెబుతూ, తనదైన సంస్కృతిని చాటుతూ.. వినోదదం పంచేందుకు ‘నిర్మల్’ సిద్ధమైంది. వారసత్వ ఉత్సవానికి పట్టణం ముస్తాబైంది. వరుసగా రెండో ఏడాది నిర్మల్ ఉత్సవాలు సోమవారం నుంచి ఐదు రోజులపాటు వేడుకలు జరుగనున్నాయి. కలెక్టర్ అభిలాషఅభినవ్ గతేడాది ప్రారంభించిన ‘నిర్మల్ ఉత్సవాల’ వారసత్వ పరంపరను ఈసారీ కొనసాగిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ మినీస్టేడియంలో వేడులకు ఏర్పాట్లు చేశారు.
చారిత్రక వారసత్వ వేడుకగా..
నిర్మల్‌కు వందలఏళ్ల చరిత్ర ఉంది. శత్రువుకు వెన్నుచూపకుండా పోరాడిన పోరాటపటిమ ఉంది. ఇక్కడి గాలిలో ఇప్పటికీ రాంజీసహా వెయ్యిమంది అమరవీరుల ఉచ్వాస, నిశ్వాసలున్నాయి. ఈ మట్టిలో అణువణువునా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు దాగిఉన్నాయి. ఇక్కడి కొయ్యబొమ్మలు, కోటబురుజులు వందలఏళ్ల చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ వారసత్వాన్ని కళ్లకు కడుతూనే ఉన్నాయి. తెలంగాణ గడ్డపై ఒక ఓరుగల్లు, ఒక గోల్కొండలు ఎలా చారిత్రక కట్టడాలుగా నిలిచాయో.. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మల్‌గడ్డపై ఇప్పటికీ అరుదైన, అద్భుత నిర్మాణాలూ ఉన్నాయి. గతేడాది నుంచి మన ఘనతను ముందుతరాలకు చాటే ప్రయత్నం ప్రారంభమైంది.
ఈసారి ఐదురోజుల వేడుకగా..
నిర్మల్ ఉత్సవాలు ఈసారి ఐదురోజులు కొనసాగనున్నాయి. గతేడాది జనవరిలోనే 5, 6, 7 తేదీల్లో చేపట్టగా, ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో మరో రోజు పొడిగించారు. ఈనేపథ్యంలో ఈసారి ఐదురోజులు నిర్వహించాలని నిర్ణయించారు. తొలిరోజు సోమవారం సాయంత్రం ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మిగిలిన నాలుగురోజులు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇందులో సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకూ చరిత్ర పరిచయంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. వీటితో స్థానిక మహిళా సంఘాలు చేసిన ఆహార పదార్థాలు, ఫుడ్‌స్టాల్స్, పిల్లలకు ఆటలు, వివిధ ప్రదర్శనలు ఉంటాయి.
విజయవంతం చేద్దాం..
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా వాసులందరం నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని, జిల్లాపేరును రాష్ట్రస్థాయిలో నిలపాలని కలెక్టర్ అభిలాషఅభినవ్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనల వేదిక, స్టాల్స్, మరుగుదొడ్లు, సెల్ఫీ పాయింట్స్, పార్కింగ్, చిన్నపిల్లల ఆటవిడుపు ప్రదేశం, ఎల్‌ఈడీ తెరలు పర్యవేక్షించారు. సందర్శకులకు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఏవో అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్ రాజు తదితరులు ఉన్నారు.


