రోడ్డు భద్రత నియమాలతో ప్రాణాలు సురక్షితం
నిర్మల్‌టౌన్: రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రాణాలు సురక్షితమని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘‘అరైవ్ అలైవ్’’ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు ప్రమాదకర ప్రాంతాల అవగాహన దినం (బ్లాక్ స్పాట్స్) గా నిర్వహించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్డు మలుపులు, గుంతలు, సిగ్నల్ లేని ప్రాంతాలపై సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లాలోని గుర్తించబడిన ప్రమాదకర రహదారి ప్రాంతాల్లో బాధిత కుటుంబాలు, ప్రయాణికులు, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి, ప్రమాదాలకు కారణాలు, జాగ్రత్తలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, సీట్‌బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్ర మాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.


