యాసంగి ఆశాజనకం
తానూరు: యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురియడంతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందలేకపోయారు. ఈ వానాకాలంలో రైతులు సాగు చేసిన సోయా భారీ వర్షాలకు వచ్చిన వరద కారణంగా దెబ్బతిని అనుకున్నంత దిగుబడి రాలేదు. పత్తి కూడా సగానికిపైగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు నానా తిప్పలు పడ్డారు. ఎన్నో ఆశలతో యాసంగిలో వివిధ పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పంటలు ఆశాజనకంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు అవగాహన కల్పిస్తే..
యాసంగిలో సాగు చేసిన పంటలపై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తే మరింత దిగుబడి పొందవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల వారీగా రైతుల పంటలను పరిశీలించి తెగుళ్ల బారి నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తే అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడవచ్చని భావిస్తున్నారు. కొన్ని గ్రామాల్లోని క్లస్టర్లలో సిబ్బంది కొరత కారణంగా అవగాహన కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయాధికారుల పోస్టులు భర్తీ చేసి పంటల సాగుపై సలహాలు ఇస్తే మరింత దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.
జిల్లాలో పంటల సాగు ఇలా..
ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో రైతులు భూమిలో తేమ ఉండడంతో యాసంగిలో వివిధ పంటలు సాగు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో 50వేల ఎకరాల్లో శనగ, 60వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో పెద్దజొన్న, గోధుమ, కుసుమ పంటలు సాగు చేశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే కష్టాలు కొంత మేరకు తొలగిపోతాయని రైతులు చెబుతున్నారు.


