పాఠశాలల్లో ఫర్నిచర్ సర్దుబాటు..
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి తక్కువ ఫర్నీచర్ ఉండటం, మరికొన్ని చోట్ల తక్కువ విద్యార్థుల సంఖ్య ఉండి అధిక ఫర్నిచర్ ఉండటం జరుగుతోంది. దీంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నిచర్ లేని పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల మధ్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్, తక్కువ విద్యార్థుల సంఖ్య ఉండి ఎక్కువ ఫర్నిచర్ ఉన్న పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి తక్కువ ఫర్నిచర్ ఉన్న సమీప పాఠశాలలకు బెంచీలు సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
2024–25 గణాంకాలు..
2024–25 గణాంకాల ప్రకారం, పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు మించి డ్యూయల్ డెస్క్ బెంచీలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి సరిపడా బెంచీలు లేకపోవడంతో వారు నేలపైనే నిత్యం కూర్చోవలసి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, అధిక ఫర్నీచర్ ఉన్న పాఠశాలల నుంచి అవసరమైన పాఠశాలలకు, ముఖ్యంగా సమీపంలో ఉన్నవి, తరలించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
ఎంఈవోలకు బాధ్యతలు..
రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి భోజన్న, ఆయా మండలాల ఏంఈవోకు క్షేత్రస్థాయి పర్యటన చేసి పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు. ఆయా మండలాల ఎంఈవోలు అందజేసిన నివేదికను కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ ఆదేశాల మేరకు సర్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల సమాచారం...
జిల్లా పేరు పాఠశాలల విద్యార్థుల
సంఖ్య సంఖ్య
నిర్మల్ 833 66792
మంచిర్యాల 719 42836
ఆదిలాబాద్ 739 65000
కుమురంభీం 721 43423
ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు..
రాష్ట్ర పాఠశాల డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను క్షేత్ర స్థాయిలో సందర్శించి ఎక్కువ ఫర్నిచర్ ఉండి తక్కువ విద్యార్థుల పాఠశాలల వివరాలను జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందజేయాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. ఎంఈవోల నివేదికను కలెక్టర్ అభిలాష అభినవ్‌కు పంపించి మేడం కలెక్టర్ సూచనల మేరకు ఫర్నిచర్ సర్దుబాటు చేస్తాం. పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– భోజన్న, డీఈవో నిర్మల్
పాఠశాలల్లో ఫర్నిచర్ సర్దుబాటు..


