పట్టాలెక్కనున్న ఆశల రైలు
రైల్వేలైన్ కోసం రూ.4,300 కోట్లతో ప్రతిపాదన డీపీఆర్ పూర్తిచేసిన దక్షిణమధ్య రైల్వే అధికారులకు చేరిన నివేదిక రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసిన ఎంపీ నగేశ్ త్వరగా పనులు ప్రారంభించాలని వినతి
నిర్మల్: నిర్మల్‌ప్రాంత ప్రజల ఆశల రైలు ఒక్కో అ డుగు ముందుకేస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ..!? అన్న ప్రజల ఆకాంక్షలను ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ఒత్తిడి పెంచుతున్నారు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ ప్రాంతంలో ని దాదాపు ఏడు లక్షల మంది జనాభాతోపాటు, దే శంలోని రెండు మహానగరాలైన హైదరాబాద్, నాగ్‌పూర్ మధ్య అనుసంధానానికి రైల్వేలైన్ నిర్మాణం వేగవంతం చేయాలంటూ ఇటీవలే రాజ్యసభలో వై ఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కోరారు. లోక్‌సభ సమావేశాల్లో రైల్వేలైన్ గురించి చర్చించడంతోపా టు తాజాగా శనివారం రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ కలిశారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వేలైన్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజె క్టు రిపోర్ట్(డీపీఆర్) రైల్వేశాఖకు చేరిందని, దీన్ని త్వరగా ఆమోదించి లైన్‌నిర్మాణం చేపట్టాలని మరోసారి విన్నవించారు.
రూ.4,300 కోట్ల అంచనా..
పటాన్‌చెరు నుంచి ఆదిలాబాద్ లైన్ వేస్తామంటూ ప్రజలను గందరగోళానికి గురిచేయకుండా, కేవలం ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు లైన్ నిర్మిస్తే సరిపోతుందని ఎంపీ నగేశ్ మరోమారు రైల్వేమంత్రికి వివరించారు. గతంలోనూ ఈమేరకే చేసిన వినతిప్రకారం దక్షిణమధ్య రైల్వే 136.50 కి లోమీటర్ల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ నిర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో డీపీఆర్ పూరి చేసింది. సోన్ వద్ద గోదావరిపై బ్రిడ్జి, ఘాట్‌రోడ్లలో ఎనిమిది చోట్ల టన్నెళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇప్పటికే రైల్వేశాఖకు చేరిందని, దీన్ని త్వరగా రైల్వేబోర్డు ఆమోదించేలా చూడాలని ఎంపీ నగేశ్ మంత్రిని కోరారు.
రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే..
డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) పూర్తయినా మరో రెండు దశలు పూర్తయితేనే రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుంది. ప్రస్తుతం ఒక అడుగు ముందుకు పడింది. ఈ డీపీఆర్‌ను రైల్వేబోర్డు ఆమోదించి, ఆర్థికశాఖ క్లియరెన్స్ కోసం పంపిస్తే సరిపోతుంది. రైల్వేబోర్డు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఒప్పుకుంటే దాదాపు నిర్మల్ మీదుగా రైల్వేలైన్‌కు పచ్చజెండా ఊపినట్లే. ఆయా ప్రక్రియలను త్వరగా పూర్తిచేసి, ప్రజల ఆకాంక్ష మేరకు లైన్ నిర్మాణం చేపట్టాలని మరోమారు రైల్వేమంత్రిని కోరినట్లు ఎంపీ నగేశ్ ‘సాక్షి’కి తెలిపారు.
ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ మ్యాప్
రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసిన ఎంపీ నగేశ్
త్వరగా పనులు ప్రారంభించాలని..
ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయింది. మిగితా ప్రకియలనూ త్వరగా పూర్తిచేసి లైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కోరాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
– గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్
ప్రతిపాదిత రైల్వేలైన్ వివరాలు..
రైల్వేలైన్ : ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్
లబ్ధిపొందే డివిజన్లు : ఆర్మూర్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆదిలాబాద్
లబ్ధిపొందే ప్రజలు : దాదాపు 7లక్షలు
లైన్ నిర్మాణ అంచనా : రూ.4,300 కోట్లు
లైన్ నిర్మాణ దూరం : 136.50 కిలోమీటర్లు
పట్టాలెక్కనున్న ఆశల రైలు


