ఓటర్లతో మొరటుగా వ్యవహరించొద్దు
ఎస్పీ జానకీషర్మిల రెండో విడత ఎన్నికలకు 800 మంది పోలీస్ సిబ్బంది సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలు
నిర్మల్ టౌన్: పంచాయతీ ఎన్నికల బందోబస్తు సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఓటర్లతో మొరటుగా వ్యవహరించొద్దని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ మున్నూరు కాపు సంఘ భవనంలో రెండో విడత ఎన్నికల బందోబస్తుపై శనివారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అత్యంత సున్నిత, సాధారణ, క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించిన ఎన్నికల కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించామని తెలిపారు. ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రత పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. రెండోవిడత ఎన్నికలకు 800 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, సీఐలు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.


