వీడని మూఢనమ్మకాలు..!
నిర్మల్/కడెం: ఏఐ స్మార్ట్ యుగంలోనూ మూఢనమ్మకాలు ప్రాణాలు తీస్తుండటం ఆందోళన కలిగి స్తోంది. మంత్రాలనెపంతో కడెం మండలం గండిగోపాల్‌పూర్‌లో ఓవ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా కర్రలతో కొట్టి చంపి, ఆనవాళ్లు లేకుండా కాల్చివేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. దశాబ్దం క్రితం వరకు ఇలాంటి ఘటనలు తరచూ జరిగేవి. ఇక మంత్రాలు, చేతబడులు, మూఢనమ్మకాల పేరిట హత్యలు తగ్గాయనుకుంటున్న తరుణంలో మళ్లీ తాజా ఘట న చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పల్లెపల్లెన, మూలమూలనా స్మార్ట్‌ఫోన్లు అడుగుపెట్టినా నమ్మకాల పేరుతో అమాయక ప్రజలను ఆడుకోవ డం, మంత్రాలే తమవాళ్ల ప్రాణాలను బలిగొన్నాయన్న అపనమ్మకాలతో ఎదుటివాళ్ల ప్రాణాలను తీయడం కలవరపెడుతోంది. మంత్రాలు, నమ్మకాల పేరిట చేస్తున్న హత్యలు ఇరువైపుల కుటుంబాలనూ రోడ్డుపాలు చేస్తున్నాయి.
మళ్లీ అవే ఘటనలు..
పదేళ్లక్రితం జిల్లాకేంద్రంలోనే గుప్తనిధుల కోసం స్థానిక శ్యామ్‌గఢ్‌లో ఓ విద్యార్థిని బలిపేరిట హత్య చేశారు. ఇదే గండిగోపాల్‌పూర్‌లో గతంలో ఇలాగే ఒకరిని చంపేశారు. జిల్లాలోని చాలా మండలాల్లో చేతబడి చేస్తున్నారని, మంత్రాలతో తమవాళ్ల ప్రా ణాలు తీస్తున్నారని కట్టేసి కొట్టడం, చంపేయడ మూ చేశారు. ఒకప్పుడంటే.. కమ్యూనికేషన్ వ్యవ స్థ, అవగాహన లేకపోవడం, ప్రతీదాన్ని గుడ్డిగా న మ్మడం వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగేవి. కాలక్రమంలో ప్రతీపల్లెలో విద్యావంతులు తయారవ్వడం, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పెరగ డం, పోలీసులు, ఇతర శాఖలు కళాబృందాల ద్వా రా అవగాహన కల్పించడంతో చాలా ఊళ్లు మూఢనమ్మకాలను వదిలించుకున్నాయి. కానీ ఇప్పటికీ.. పల్లెల్లో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనల ఆనవాళ్లు బయటపడుతున్నాయి.
రోడ్డుపాలవుతున్న కుటుంబాలు..
అపనమ్మకాల కారణంగా చోటుచేసుకుంటున్న ఘ టనలతో ఇరువైపులా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. చనిపోయినవారి కుటుంబంతోపాటు చంపినవారి కుటుంబాలూ తమ ఇళ్లు చూసుకునే పెద్దదిక్కు లేక శిక్షను అనుభవించాల్సి వస్తోంది. ఎవరి పైన అనుమానం ఉంటే.. పోలీసులకు ఫిర్యాదు చే యొచ్చు. కానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటం, ప్రాణాలు తీయడం సరికాదు.
మూఢనమ్మకాలు వీడాలి..
ప్రజలు వాస్తవాలను తెలుసుకోకుండా మూఢనమ్మకాలను నమ్మవద్దు. ఇలాంటి వాటితో ప్రాణాలు పోవడం, జీవితాలు నాశనం కావడమే కాదు, కుటుంబాలూ జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మూఢనమ్మకాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
–ఉపేంద్రరెడ్డి, ఏఎస్పీ


