ధాన్యం కోతపై అధికారుల నిలదీత
కుంటాల: ఆరుగాలం కష్టపడి పంటల సాగు చేసినా.. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించి నా ధాన్యంలో కోత విధిస్తున్నారని శనివారం అందకూర్ కొనుగోలు కేంద్రానికి వచ్చిన డీసీవో నర్సయ్యను రైతులు నిలదీశారు. కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకు 3 కిలోల చొప్పున క్వింటాల్‌కు సుమారు ఏడున్నర కిలోల చొప్పున కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ తేమ శాతం వచ్చిన తర్వాతనే తూకం వేసి రైస్ మిల్‌కు పంపినా మళ్లీ కోత విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల పెద్దపల్లి రైస్‌మిల్‌కు ఏడుగురు రైతులకు చెందిన 802 బస్తాలను పంపగా, 45 బస్తాలు కోత విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో పీఏసీఎస్ తమ సిబ్బంది తప్పిదమేమీ లేదని, మిల్లులో తప్పు జరిగి ఉండవచ్చని, మిల్లర్లతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని డీసీవో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఆయన వెంట సీఈవో నాగభూషణం ఉన్నారు.


