పరిమితికి లోబడి ఖర్చు చేయాలి
సారంగపూర్: పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితికి లోబడే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు అయేషా మస్రత్ ఖానం అన్నారు. మండల కేంద్రంలో అభ్యర్థులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు సంబంధిత గ్రామపంచాయతీ జనాభా లెక్కల ఆధారంగా ఎన్నికల కమిషన్ నిర్ణయించిన మేరకే ఖర్చు చేయాలన్నారు. ఎన్నికల వ్యయాలను మండల కేంద్రంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు నిత్యం పరిశీలిస్తారని తెలిపారు. ఎన్నికలు ముసిగిన తర్వాత గెలిచిన వారు, ఓడినవారు లెక్కలు సమర్పించాలని పేర్కొన్నారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ రోజు ఎక్కడా పొరపాట్లు జరగకుండా అన్నిపోలింగ్ కేంద్రాలకు సామగ్రి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, తహసీల్దార్ సంధ్యారాణికి సూచించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసే బ్యాలెట్‌బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులను మరోమారు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పోలింగ్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. అక్కడి నుంచి ధని గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎన్నికలు సజావుగా సాగేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీవో అజీజ్‌ఖాన్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


