జిల్లాలో పోలింగ్ ప్రశాంతం
నిర్మల్‌టౌన్: జిల్లా పరిధిలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగిందని ఎస్పీ జానకీ షర్మిల ఓ ప్రకటనలో తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అదనపు పోలీస్ బలగాలను మో హరించామని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతించలేదని పేర్కొన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలు జరిపితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
కడెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ జానకీ షర్మిల సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రాజేశ్‌మీనా, ఉపేంద్రరెడ్డి, ఎస్సై సాయికిరణ్ ఉన్నారు.
దస్తురాబాద్‌లో ఏఎస్పీ..
దస్తురాబాద్: మండలంలోని పెర్కపల్లి, మున్యా ల, దస్తురాబాద్‌లోని పోలింగ్ కేంద్రాలను గురువారం ఏఎస్పీ ఉపేందర్‌రెడ్డి పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల భద్రతను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. ఏఎస్పీ వెంట ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్సై సాయికుమార్ తదితరులున్నారు.


