సోయా రైతు చిత్తు..! | - | Sakshi
Sakshi News home page

సోయా రైతు చిత్తు..!

Oct 26 2025 6:49 AM | Updated on Oct 26 2025 6:49 AM

సోయా రైతు చిత్తు..!

సోయా రైతు చిత్తు..!

భైంసా మార్కెట్‌లో ‘కమీషన్‌’ దోపిడీ రూ.వందకు రూ.3 చొప్పున కోత ఇష్టారీతిన దోచుకుంటున్న ఏజెంట్లు, వ్యాపారులు పట్టించుకోని మార్కెట్‌ కమిటీ అధికారులు

భైంసాటౌన్‌: భైంసా మార్కెట్‌లో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు రైతులను ఇష్టారీతిన దోచుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తరువాత అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌ భైంసా కావడంతో భైంసా డివిజన్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే రైతుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుంటున్న ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లు దోపిడీకి పాల్పడుతున్నారు.

క్యాష్‌ కటింగ్‌ పేరిట కోతలు..

మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్‌ వ్యవస్థ రైతులను పీడిస్తోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించాలంటే కమీషన్‌ ఏజెంట్‌ తప్పనిసరి. ముందుగా వ్యవసాయ మార్కెట్‌కు తెచ్చింది మొదలు పంట అమ్ముకునే వరకు దోపిడీ తప్పడం లేదు. రైతు తెచ్చిన పంట కుప్పను ముందుగా ట్రేడర్లు పరిశీలించి తేమ శాతం ఆధారంగా ఈ–నామ్‌లో ధర నిర్ణయిస్తారు. ఇందులో హమాలీ, దడ్‌వాయి, చాటావాల చార్జీలతో పాటు కమీషన్‌ ఏజెంట్‌ చార్జీల పేరిట రూ.వందకు రూ.1.50 కోత విధిస్తున్నారు. ఇదంతా తక్‌పట్టీపై అధికారికంగా కోత విధిస్తుండగా, అనధికారికంగా తక్‌పట్టీ వెనుక కమీషన్‌ ఏజెంట్లు క్యాష్‌ కటింగ్‌ పేరిట రూ.వందకు మరో రూ.1.50 అదనంగా కోత విధిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట విక్రయించేదే డబ్బుల కోసమని.. అలాంటిది క్యాష్‌ (నగదు చెల్లింపు) కటింగ్‌ పేరిట అదనంగా కోత విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తూకాల్లోనూ 50 కిలోల సంచికి 1200 గ్రాములు అదనంగా తీసుకుంటున్నారని వాపోతున్నారు.

పట్టించుకోని ఏఎంసీ అధికారులు..

మార్కెట్‌ యార్డులో ఇష్టారీతిన డబ్బుల చెల్లింపులో కోతలు విధిస్తున్నా.. సంబంధిత మార్కెట్‌ కమిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. కమీషన్‌ చార్జీల పేరిట అనధికారికంగా వసూలు చేస్తున్నా.. వారిని ప్రశ్నించిన పాపాన పోవడం లేదు. మరోవైపు దీపావళి ఇనామ్‌ పేరిట చాటావాలాలు ఇబ్బందికి గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తే, పంట విక్రయానికీ ఇబ్బందులు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మార్కెట్‌ కమిటీ అధికారులు మార్కెట్‌లో ఇష్టారీతి దోపిడీని అరికట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.

రైతులు ఫిర్యాదు చేయాలి..

మార్కెట్‌ యార్డులో పంట ఉత్పత్తులు విక్రయించే రైతుల వద్ద నగదు చెల్లింపు పేరిట కమీషన్‌ ఏజెంట్లు అదనంగా వసూలు చేయవద్దు. నిబంధనల ప్రకారం రూ.వందకు రూ.1.50 మాత్రమే తీసుకోవాలి. ఎవరైనా అదనంగా వసూలు చేస్తే రైతులు ఫిర్యాదు చేయాలి.

– పూర్యానాయక్‌, ఏఎంసీ సెక్రెటరీ, భైంసా

అదనంగా కోత పెట్టొద్దు..

కమీషన్‌ ఏజెంట్‌ చార్జీల పేరిట రూ.వందకు రూ.1.50 మాత్రమే రైతు వద్ద తీసుకోవాలి. అదనంగా నగదు చెల్లింపు పేరిట ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం.

– గజానంద్‌,

జిల్లా మార్కెటింగ్‌ అధికారి, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement