ఆధ్యాత్మిక చింతనతోనే సన్మార్గం
ఖానాపూర్: ఆధ్యాత్మిక చింతనతోనే సన్మార్గం సాధ్యమవుతుందని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ గోదా శ్రీకృష్ణ నూతన మందిర ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో హవనాలు, శాంతిపాఠం, వేద పారాయణాలు, శాంతిహోమం, మహా పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం శ్రీగోదా రంగనాథుల తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికర్త దేవుడు లేనిదే జీవుడు లేడని, మాధవ సేవగా సర్వప్రాణి సేవచేసి తరించాలని అన్నారు. మనిషి ఎంత సంపాదించినా ఎంత చేసినా చివరికి మిగిలేది మంచి జ్ఞాపకాలేనన్నారు. ఆలయాలు నిర్మించడం సంతోషకరమని, అర్చకులు వద్దిపర్తి వెంకటరమణ సంకల్పాన్ని రూపా సురేశ్‌రెడ్డి, అనితారెడ్డి సఫలం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏపీపీఎస్సీ సభ్యులు పైడిపెల్లి రవీందర్ రావు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, డా.సునీత విజయ్‌కుమార్, నాయకులు భూక్య జాన్సన్ నాయక్, చిన్నం సత్యం, కల్వకుంట్ల నారాయణరావు, కొత్తపెల్లి సురేశ్, అల్లాడి వెంకటేశ్వర్లు, మంత్రరాజ్యం సురేశ్, కొండాడి గంగారావు, కొందుకూరు శ్రీనివాస్, బీసీ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.


