కళాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
నిర్మల్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర హస్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అనిత శ్రీనివాస్ ఫోటో ఎంబ్రాయిడరీ స్టోర్‌ను ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో కాంగ్రెస్ నాయకులు ఆయనను ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ కొయ్య బొమ్మల కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు తీసుకురానునట్లు తెలిపారు. కొయ్య బొమ్మల తయారీపై ఆధారపడిన కుటుంబాలకు 90 శాతం సబ్సిడీతో రూ.5కోట్ల రుణం త్వరలో మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ కళ అంతరించిపోకుండా స్కిల్ యూనివర్సిటీ సిలబస్ లో నిర్మల్ కోయబొమ్మల అంశాన్ని చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చిత్రాలు వేసే శ్రీనివాస్ కళాకారుడికి జిల్లా కేంద్రంలో ఎంబ్రాయిడరీ షాప్ ఏర్పాటు చేయడానికి రూ.20 లక్షల రుణాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, కాంగ్రెస్ నాయకులు నాందేడపు చిన్ను, తదితరులు పాల్గొన్నారు.


