దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శిబిరాలు నిర్వహించే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు జిల్లా వారీగా రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. అర్హులకు ధ్రువీకరణ పత్రం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి సులభంగా అందుతాయన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హైజాన్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో నెలకు సుమారు 12 శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 960 యూడీఐడీ కార్డులు అందించినట్లు తెలిపారు. దివ్యాంగులు శిబిరాలకు హాజరయ్యేలా గ్రామీణాభివృద్ధి, సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు.


