లైసెన్స్‌డ్ సర్వేయర్లొస్తున్నారు..
మొదటి విడతలో 73 మందికి శిక్షణ.. 49 మంది అర్హత ఉత్తీర్ణులైన వారికి సీఎం చేతుల మీదుగా లైసెన్సులు అందజేత రెండో విడతలో 81 మందికి ట్రైనింగ్ నేడు రెండో విడత పరీక్ష
నిర్మల్‌చైన్‌గేట్: భూమి కొలతలలో పారదర్శకత, కచ్చితత్వం సాధించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు ప్రారంభించింది. ఆధునిక పరికరాలతో భూసర్వే చేపట్టేందుకు జిల్లాలో లైసెన్స్ పొందిన సర్వేయర్లు అధికారికంగా రంగంలోకి అడుగుపెట్టారు. అక్టోబర్ 23న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందిన 49 మందికి లైసెన్సులు అందజేశారు.
మండలాల వారీగా సర్వేయర్ల కేటాయింపు
జిల్లాలో మొత్తం 18 మండలాల్లో సర్వేయర్ల డిమాండ్ అధికంగా ఉంది. ప్రతీ మండలానికి నలుగురు నుంచి ఆరుగురు సర్వేయర్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 12 మంది రెగ్యులర్ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల రాకతో భూ కొలతల వేగం పెరగనుంది.
మొదటి విడతలో 73 మందికి శిక్షణ..
భూసర్వేయర్‌గా మారేందుకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత, ప్రభుత్వం మొదటి విడతలో 73 మందిని ఎంపిక చేసింది. 50 రోజుల సాంకేతిక శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలో 49 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి సీనియర్ సర్వేయర్ల ఆధ్వర్యంలో అదనంగా 40 రోజుల క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వడం జరిగింది. అర్హత సాధించిన వారికి ఇటీవల ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది.
రెండో బ్యాచ్‌కు శిక్షణ షురూ..
ఆగస్టు 18న ప్రారంభమైన రెండో బ్యాచ్‌లో మొత్తం 81 మంది పాల్గొంటున్నారు. గత పరీక్షలో ఉత్తీర్ణత పొందలేని 24 మందికి అక్టోబర్ 26న మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. తదుపరి దశలో ఉత్తీర్ణులైన వారికి కూడా లైసెన్సులు జారీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
అధునాతన పరికరాలతో కొలతలు
లైసెన్స్ పొందిన సర్వేయర్లకు ప్రభుత్వం డీజీపీఎస్ మిషన్లు అందించనుంది. వీటి సహాయంతో భూ సరిహద్దులు నాణ్యమైన డిజిటల్ డేటాలో నమోదు కానున్నాయి. ఇది రికార్డు స్పష్టతను తెచ్చి, భూవివాదాలను తగ్గిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కొంతమంది సర్వేయర్లు తమ పారితోషికాల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ ప్రోత్సాహక వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు.
త్వరలో మండలాల
కేటాయింపు..
ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడత ఉత్తీర్ణులైన 49 మందికి లైసెన్సులు అందించారు. అధికారుల ఆదేశాల ప్రకారం త్వరలోనే వీరికి మండలాలు కేటాయిస్తాం. మొదటి విడతలో ఫెయిల్ అయిన వారితోపాటు రెండవ బ్యాచ్‌కు ఈ నెల 26న రాత పరీక్ష ఉంటుంది.
– రాథోడ్ సుదర్శన్, ఏడీ సర్వేయర్
జిల్లా వివరాలు
మొత్తం మండలాలు 18
రెగ్యులర్ సర్వేయర్లు 12
ఐకేపీ సర్వేయర్లు 5
జిల్లాలోని మొత్తం సర్వే నంబర్లు 1,67,046
జిల్లాలోని భూ విస్తీర్ణం
8,96,523.11 ఎకరాలు
మొదటి విడత ట్రైనింగ్ పొందిన
సర్వేయర్లు 73
అనుత్తీర్ణులైన వారు 24
లైసెన్స్ పొందిన సర్వేయర్లు 49
రెండవ విడత పరీక్ష రాసేవారు 81
లైసెన్స్‌డ్ సర్వేయర్లొస్తున్నారు..


