దేశ నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం
భైంసాటౌన్: వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని దక్షిణ మధ్య క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా భైంసా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డ్‌లో పథ సంచలన్–సార్వజనికోత్సవం నిర్వహించారు. ముందుగా ఆయా కాలనీల నుంచి స్వయం సేవకులు పురవీధుల మీదుగా సభాస్థలికి చేరుకున్నారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న చంద్రశేఖర్ మా ట్లాడుతూ.. 1925లో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో పనిచేస్తుందని, ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ విస్తరించిందన్నారు. హిందుత్వ జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మ తాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంటింటి జనజాగరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్త నాగ్‌నాథ్ పటేల్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, సహ సంఘచాలక్ సాదుల కృష్ణదాస్, స్వయం సేవకులు, మహిళలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.


