
బహుదూరపు బాటసారులు
గొర్రెల మేత కోసం ఇతరప్రాంతాలకు కాపరులు ఏడాదిలో మూడునెలలు ఇంటికి దూరం వృత్తిని నమ్ముకుని జీవనం
లోకేశ్వరం: మండలంలోని రాజూర, వట్టోలి, ధర్మోర, కన్కపూర్ గ్రామాల గొర్రెల కాపరులు బహుదూరపు బాటసారులు. ఏడాదిలో మూడు నెలలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గొర్రెల మందతోపాటు మేత కోసం తిరుగుతూనే ఉంటారు. నిర్మల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుకుని ఉండటంతో ఇక్కడి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎస్సారెస్పీ నిండనంత వరకు వెనుకభాగం పశుగ్రాసం లభిస్తుండటంతో రోజూ ఉదయం, సాయంత్రం వరకు జీవా లను మేపుతుంటారు. ఏటా జూలై, ఆగస్టులో ఎస్సారెస్పీ నిండుకుండలా మారుతుంది. వెనుకభాగం నీటితో నిండి ఉంటుంది. దీంతో జీవా లకు గ్రాసం దొరకక వలస వెళ్లాల్సిన పరిస్థితి. వీరంతా మళ్లీ వరి నూర్పిడి పూర్తయ్యే వరకు దాదాపు మూడునెలలు ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలోని గుట్టలపై, నిజామాబాద్ జిల్లాలోని బా డ్సీ ప్రాంతాలకు వెళ్తారు. మండలాలకు చెందిన గొర్రెల కాపరులు బృందాలుగా ఏర్పడి మందలతో బయల్దేరుతారు. అడవిలో ఉంటూ వాటిని మేపుతూ అక్కడే వంట, భోజనాలు చేస్తారు. రాత్రి మందల వద్దే నిద్రిస్తారు. వంట సామగ్రి కోసం అక్కడి నుంచి కొందరు రావడమో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లేవారు వెంట తీసుకెళ్తారు.
తరచూ ప్రమాదాలు
సుదూర ప్రయాణం రోడ్డు మార్గంలో సాగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలు ఢీకొని జీవాలు చనిపోతున్నాయి. ఇన్సూరెన్సు లేకపోవడంతో కాపరులు నష్టపోతున్నారు. ఇప్పటికై న పశుసంవర్థక శాఖ అధికారులు పట్టించుకుని జీవాలకు ఇన్సురెన్సు చేసేలా చర్యలు తీసుకోవాలి.
పొలాల్లో గ్రాసం
పెంచుకోవాలి
జీవాలు, పశువుల యజమానులు వారి పంట పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి. జీవాలు, పశువులకు ఇన్సురెన్సును చేయించుకోవాలి. గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయిస్తున్నాం. పశువైద్యుల సూచనలు పాటించాలి.
– రాజేశ్వర్, నిర్మల్
పశుసంవర్థక శాఖ డెప్యూటీౖ డెరెక్టర్
ఇదే వృత్తిని నమ్ముకున్నాం
ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఏడాదిలో మూడు నెలలు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాం. ఒక్కో మందకు నలుగురు కాపలాగా ఉంటారు. గుట్ట ప్రాంతంలో జీవాలను మేపుతూ తిరుగుతాం. గొర్రెల కాపరులను ప్రభుత్వం పట్టించుకోవాలి. – బరిడే పోతన్న, రాజూర
మేత దొరకక
దూరప్రాంతాలకు
ఎస్సారెస్పీ నిండితే జీవాలకు మేత దొరకడం కష్టమవుతుంది. మేత కోసం దూరప్రాంతాలకు జీవాలతో వెళ్తుంటాం. వంట సామగ్రి తీసుకెళ్తాం. అటవీప్రాంతాల్లో జీవాలను మేపుతున్నాం.
– గీజాగంగాధర్, ధర్మోర
పొలాల్లోనే నిద్ర
మండలంలోని రాజూర గ్రామానికి చెందిన 20 మంది కాపరులు, వట్టోలిలోని 10 కురుమ యాదవ, కుటుంబాల వారు మూడు నెలలు ఇంటికి దూరంగా ఉంటున్నారు. వందలాది కిలోమీటర్లు తిరుగుతూ ఎక్కడ చీకటిపడితే అక్కడే పొలాల్లో నిద్రిస్తున్నారు. సరైన భోజనం, నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి జీవాలకు సైతం తాగునీరు లభించని పరిస్థితి. వాగులు, వంకలు అందుబాటులో ఉంటేనే నీరు తాగిస్తున్నారు. తమ గ్రామాల్లో మేత దొరకగానే తిరుగుపయనమతారు.
జీవాలు సంఖ్య
గొర్రెలు 3.50 లక్షలు
మేకలు 1.25 లక్షలు
నిర్మల్ జిల్లాలో..
వారంతా తమ కులవృత్తి అయిన గొర్రెల పెంపకాన్ని నమ్ముకొని జీవనం సాగించే యాదవులు. ఉన్న ఊరిలో జీవాలకు గ్రాసం దొరకకపోవడంతో పెంపకందారులు బృందంగా ఏర్పడి ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఏడాదిలో మూడు నెలలు అడవిలో ఉంటూ వండుకొని తింటారు. తమ జీవనోపాధితోపాటు జీవాల మేత కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న బాటసారులపై ప్రత్యేక కథనం.

బహుదూరపు బాటసారులు

బహుదూరపు బాటసారులు

బహుదూరపు బాటసారులు