
మద్యం షాపుల్లో చోరీ కేసు ఛేదింపు
భైంసాటౌన్:ముధోల్, తానూరులోని మద్యం షాపుల్లో మందు బాటిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్‌బిలోలికి చెందిన యాపరి వినోద్ గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. తన బెల్టుదుకాణంలో మ ద్యం విక్రయం కోసం వైన్స్ షాపుల్లో దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇందుకు తన సొంత జిల్లాలో చోరీ చేస్తే దొరికిపోతానని, నిర్మల్ జిల్లాపై ఫోకస్ చేశాడు. తన బెల్టుదుకాణం వద్ద మద్యం తాగేందుకు రెగ్యులర్‌గా వచ్చే బేగరి రోహిత్, నీరడి శ్రావణ్‌కుమార్, ఖదులూరి సాయి, ఆదిత్యగౌడ్, సట్ల నవీన్, దిలీప్‌తో జట్టు కట్టాడు. గత మే నెలలో ముధోల్‌లోని రాజరాజేశ్వర వైన్స్ షాపు వెనుక రేకులు తొలగించి మందు బాటిళ్లు చోరీకి పాల్పడ్డాడు. తానూరులోని శ్రీ లక్ష్మి వైన్స్‌షాపులోనూ అదే తరహాలో చోరీ చేశాడు. ఇలా చోరీ చేసిన మందు బాటిళ్లను తన బెల్టుదుకాణంలో విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల మరోమారు అదే తరహాలో చోరీ కోసం ముధోల్‌కు రాగా, అనుమానించిన పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. ముధోల్‌లో రూ.2.50 లక్షలు, తానూరులోని వైన్స్ షాప్‌ల్లో రూ.80 వేల మద్యం బాటిళ్లను చోరీ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.