
పంట మార్పిడితో అధిక దిగుబడి
భైంసారూరల్: పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించవచ్చని డీఏవో అంజిప్రసాద్ అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పొలాస విద్యార్థుల ఆధ్వర్యంలో కిసాన్ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణతో పనులు వేగవంతం అవుతాయన్నారు. రైతులు సేంద్రియ ఎరువులు వాడితే ఎంతోమేలు జరుగుతుందన్నారు. యూరియా మోతాదుకు మించి వాడితే దిగుబడి తగ్గడమే కాకుండా భూసారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. మానవుల ఆరోగ్యనికి అనర్థాలు తెచ్చిపెడుతుందన్నారు. రైతులు రసాయన ఎరువులు వాడేముందు, పంటలు సాగు చేసే క్రమంలో తప్పకుండా వ్యవసాయధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. నేల సారాన్ని పెంచుకోవడం, భూ పరిరక్షణ, నీటి సంరక్షణ పద్ధతులను రైతులకు వివరించారు. అనంతరం విద్యార్థులు అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, పంటలకు వాడే రసాయన ఎరువులను ప్రదర్శించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ వీణ, ఏవో గణేశ్, ముధోల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ దినేశ్, వేణు, సౌజన్య, అధ్యాపకులు పాల్గొన్నారు