
పరిహారం ఇస్తేనే యాసంగి!
50 రోజులుగా వెంటాడుతున్న వర్షాలు గోదావరి వరద బీభత్సంలో వందల ఎకరాల్లో నష్టం పరిహారం కోసం బాధిత రైతుల నిరీక్షణ
ఈ ఫొటోలోని రైతుపేరు పండరి. ముద్గల్‌కు చెందిన ఈయన ఈ వానాకాలం తనకున్న మూడు ఎకరాల్లో సోయా, మరో ఎకరంలో వరి, ఇంకో ఎకరంలో పత్తి పంట వేశాడు. భారీ వర్షాలకు పత్తి, సోయా, వరి పంటలన్నీ దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి తీవ్ర నష్టం జరుగుతోంది. అధికారులు ప్రాథమిక సర్వే చేసి నష్టం అంచనా వేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం అందలేదు. పెట్టుబడి, రెక్కల కష్టం వృథా అయ్యాయని ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నాడు.
భైంసా/భైంసారూరల్: జిల్లా రైతులు ఈ సీజన్‌లో పండించిన పంటలు భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యాభై రోజులుగా కురుస్తున్న వర్షాలు, గోదావరి నదీ ప్రవాహం కలిసి పంట భూములను పూర్తిగా ముంచేశాయి. సెప్టెంబర్ చివరి వారంలో.. వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల ప్రభావం ఇంకా తగ్గలేదు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామాలవారీగా నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అదే సమయంలో ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిస్థితిని సమీక్షించి, పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పంట నష్టపోయిన రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ, పరిహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
నష్టపోయిన ప్రధాన పంటలు
జిల్లాలో ప్రధానంగా సాగు అయ్యే సోయా, మిను ము, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నా యి. లక్షల రూపాయలు నష్టపోయిన రైతులు పరిహారం అందించి యాసంగి పంటలు సాగు చేసేలా చూడాలని కోరుతున్నారు.
కౌలు రైతుల పరిస్థితి దారుణం..
ఎకరానికి రూ.16 వేల నుంచి రూ.24 వేల వరకు కౌలు చెల్లించి భూములు సాగు చేసుకున్న రైతులు రెండింతల కష్టాల్లో చిక్కుకున్నారు. ఒకవైపు భూమి యజమానులకు కౌలు ఇవ్వాల్సిన ఒత్తిడి, మరోవైపు పంట కోసం తీసుకున్న అప్పులు తిరగిరాలేని స్థితి. బీమా లేకపోవడం, ప్రభుత్వ సహాయం ఆలస్యమవడం వారి ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది.
వరదల ప్రభావం
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలతో గోదా వరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో నిర్మల్ జిల్లా రైతు భూములు వరద నీటిలో చిక్కుకున్నాయి. మొత్తం 30 వేల ఎకరాలకుపైగా పంటలు నీటమునిగాయి. ముధోల్, బాసర, లోకేశ్వరం, దిలావర్‌పూర్, లక్ష్మణచాంద మండలాల్లో వరదకు పంటలు దెబ్బతిన్నాయి. కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కారణంగా పరీవాహక గ్రామాల్లో పంటలు మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశాయి.
సాయం అందితేనే..
యాసంగి పంటలసాగు ఈసారి పూర్తిగా ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు విత్తనా లు, ఎరువులు ఉచితంగా అందిచాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. జిల్లా వ్యాప్తంగా సంఘం సేకరించిన వివరాల ప్ర కారం, అత్యవసర ఆర్థికసాయం ఇవ్వకుంటే యాసంగి సాగు కష్టమవుతుంది.
స్పష్టత కరువు..
పంట నష్టానికి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఫీల్డ్ సర్వేలు పూర్తి చేశారు. కానీ రైతులు ఎదురుచూస్తున్న పరిహార చెల్లింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ముధోల్ మండలంలోని రైతులు ఇప్పటికే తహసీల్దార్‌కు వినతి పత్రాలు అందజేశారు. అయినా వాస్తవ సహాయం దిశగా కార్యచరణ కనిపించడం లేదు.
పెట్టుబడి లేదు..
వానాకాలం పంటలన్నీ నీటమునిగాయి. పంట కోసుకున్న పెట్టుబడి కూడా చేతికిరాదు. ఇలాంటి పరిస్థితిలో యాసంగిలో పంటల సాగు ఎలా చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వమే నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. భారీగా నష్టపోయిన జిల్లా రైతులకు యాసంగిలో శెనగ, మొక్కజొన్న విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి.
– మారుతి, రైతు, కథ్‌గాం

పరిహారం ఇస్తేనే యాసంగి!

పరిహారం ఇస్తేనే యాసంగి!