
స్థానిక సమరానికి బ్రేక్
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫకేషన్ గురువారం ఉదయం కలెక్టర్ విడుదల చేశారు. దీంతో ఆశావహుల్లో ఉత్సాహం కనిపించింది. మొదటి రోజు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే సాయంత్రానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.
నామినేషన్ల ప్రక్రియలో గందరగోళం..
నోటిఫికేషన్ విడుదలైన వెంటనే జిల్లాలో నామినేషన్లు స్వీకరణ మొదలైంది. పెంబి ఎంపీటీసీకి 2, శెట్టిపల్లి ఎంపీటీసీ, మందపల్లి ఎంపీటీసీ, మామడ ఎంపీటీసీ స్థానాలకు ఒక్కో నామినేషన్ దాఖలయ్యా యి. అయితే సాయంత్రం హైకోర్టు స్టేతో నామినేష న్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం ఏంటి అన్న ఉత్కంఠ నెలకొంది.
ఆశావహుల్లో నిరాశ..
ఎన్నికల బరిలోకి దిగేందుకు నెలల తరబడి సన్నద్ధమైన ఆశావహులు, హైకోర్టు ఉత్తర్వులతో తీవ్ర నిరాశకు గురయ్యారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ, సేవా కార్యక్రమాలు చేపట్టి, ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసిన వారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియ సాగే సూచనలు లేకపోవడంతో రాజకీయ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఖర్చులు, ఏర్పాట్లు అనిశ్చితిలో
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలోకి దిగేందుకు చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే వందలాది ఫ్లెక్సీలు సిద్ధం చేసుకున్నారు. ఇందుకు భారీగా ఖర్చులు చేశారు. కొందరు ఆర్థికంగా కూడా సిద్ధమయ్యారు. కుల నాయకులతో చర్చలు జరిపి, గ్రామ నేతల మద్దతు కూడగట్టుకున్నారు. కానీ ఎన్నికలు వాయిదా పడడంతో స్థానిక సమరం నిలిచిపోయింది.