
‘పది’ విద్యార్థులకుప్రత్యేక తరగతులు
ఉపాధ్యాయులు సిలబస్‌ను జనవరి 10లోపు పూర్తి చేయాలి.
ఆ తరువాత రివిజన్ తరగతులు ప్రారంభించాలి.
ఎస్‌ఏ–1 పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించాలి.
సీ గ్రూప్ విద్యార్థులకు పునశ్చరణ తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహించాలి.
ప్రతీ ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను ‘‘దత్తత’’ తీసుకొని, వారిని వ్యక్తిగతంగా మార్గదర్శనం చేయాలి.
విద్యార్థుల హాజరును 100% సాధించేలా పర్యవేక్షణ చేస్తారు.
మామడ: జిల్లాలో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచే దిశగా విద్యాశాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు పరీక్ష సమయంలో కాకుండా ఇప్పటి నుంచే అభ్యాసంపై దృష్టి పెట్టేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31 వరకు ఈ ప్రత్యేక సెషన్లు కొనసాగనున్నాయి.
సమయ పట్టిక
ప్రతీరోజు రెండుసార్లు తరగతులు నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. ఈ తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించడం, ఆత్మవిశ్వాసం పెంచడం, సందేహాలు నివృత్తి చేయడం తదితర కార్యక్రమాలు ఉంటాయి.
గత ఫలితాల ఆధారంగా..
జిల్లా 2022–23, 2023–24 విద్యాసంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, 2024–25లో 15వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి విద్యాధికారులు ఈసారి తప్పక మంచి ఫలితాలు సాధించే విధంగా పాఠశాలలలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు.
వారానికోసారి సమీక్ష
ప్రతీ పాఠశాలలో వారానికి ఒకసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష జరుగుతుంది. మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాల అమలును పరిశీలిస్తారు. విద్యార్థుల అభ్యసన స్థాయి, మార్కుల పెరుగుదల వంటి అంశాలను రికార్డులుగా నమోదు చేయాలి. హాజరు కాని విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు స్వయంగా సందర్శించి హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత లేకుండా ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేస్తున్నాము. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు వదశాతం హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. పదిలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికను రూపొందించాం.
– దర్శనం భోజన్న, జిల్లా విద్యాధికారి
మార్గదర్శకాల ఇలా..
జిల్లా వివరాలు
ప్రభుత్వ పాఠశాలలు 117
పదో తరగతి విద్యార్థుల సంఖ్య 4,155
ఆదర్శ పాఠశాల 01
విద్యార్థుల సంఖ్య 100
కేజీబీవీలు 18
విద్యార్థులు సంఖ్య 867