
ఎన్నికల నిర్వహణకు నిధుల కొరత
నేడు పరిషత్ తొలి విడత నోటిఫికేషన్ విడుదలకాని ప్రత్యేక గ్రాంట్ ఒక్కో మండలానికి రూ.3 లక్షల వ్యయం ఆర్థికభారంతో అధికారులు సతమతం
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిధుల సమస్య వచ్చి పడింది. ఎన్నికల ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ ఇంకా విడుదల కాలేదు. బుధవారం హైకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణపై అధికారుల్లో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఓటరు జాబితాల రూపకల్పన నుంచి పోలింగ్ సామగ్రి, రవాణా ఖర్చులు చాలా అయ్యాయని, ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలు వడగా గ్రాంట్ రాకుంటే ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విడుదల కాని ప్రత్యేక గ్రాంట్..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9, 13 తేదీల నుంచే జిల్లాలో 18 జెడ్పీటీసీలు, 157 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులకు నేడు (గురువారం) నోటిఫికేషన్ రానుంది. ఎన్నికల సామగ్రిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమకూర్చినా స్టేషనరీ, ఎన్నికల సామగ్రి రవాణా, సమావేశ బ్యానర్లు, బ్యాలెట్ బాక్సుల మరమ్మతులు, జిరాక్స్‌లు, హమాలీ ఖర్చులు, సిబ్బందికి శిక్షణ, స్నాక్స్, భోజనాలు, తదితర ఖర్చుల భారమంతా మండల, జిల్లా అధికారులపైనే పడుతోంది. ఈ అవసరాల కోసం నిధులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న స్టేషనరీ దుకాణాల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఏ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు పడిన దాఖలాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించినా జిల్లాకు ఇంకా ఒక్కపైసా కూడా మంజూరు చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికే పలు మండలాల్లో ఎన్నికల వ్యయం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చేరుకుంది.
ప్రత్యేక పాలనలో పల్లెలు..
గతేడాది ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఇదే తరహాలో గతేడాది ఆగస్టు నుంచి జిల్లా, మండల పరిషతుల్లో స్పెషలాఫీసర్ల పాలన నడుస్తోంది. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సైతం సక్రమంగా విడుదల కావడం లేదు. దీంతో పంచాయతీలు, మండల పరిషత్ ప్రత్యేక అధికారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. విధిలేని పరిస్థితుల్లో స్పెషలాఫీసర్లు, కార్యదర్శులు సొంత నిధులతో పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఆ సమస్య మరింత తీవ్రమైంది. ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ వచ్చే నాటికై నా ప్రత్యేక ఎన్నికల గ్రాంట్ విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు.
జిల్లా వివరాలు
పంచాయతీ డివిజన్‌లు 02
జెడ్పీటీసీ స్థానాలు 18
ఎంపీటీసీ స్థానాలు 157
పోలింగ్ కేంద్రాలు 892
గ్రామ పంచాయతీలు 400
వార్డులు 3,368
పురుష ఓటర్లు 2,13,805
మహిళా ఓటర్లు 2,35,485
ఇతరులు 12
మొత్తం ఓటర్లు 4,49,302