
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్‌చైన్‌గేట్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు.బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌమిదిని అన్నారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటి విడతలో తొమ్మిది జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు గురువారం నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ, వీఎస్టీ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఆర్వో, ఏర్వోలకు ఇప్పటికే పలుమార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్
అనంతరం ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలన్నారు. 12 న నామినేషన్ల పరిశీలన, 15 న ఉపసంహరణ, 23న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, నవంబర్ 11న ఫలితాలు ఉంటాయన్నారు. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి, అన్ని ఫారాలు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్వో విష్ణువర్ధన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.