
కవ్వాల్ అందాలు చూసొద్దాం!
జన్నారం అటవీ డివిజన్‌లో ప్రారంభమైన సఫారీ వర్షాలు తగ్గడంతో అటవీశాఖ అనుమతి రోజుకు మూడుసార్లు.. రెండు గంటలు ప్రయాణం స్వల్పంగా పెరిగిన ధరలు
జన్నారం: పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, చెంగుచెంగున ఎగురుతూ పరిగెత్తే వన్యప్రాణులు, స్వచ్ఛమైన ప్రాణవాయువు.. వీటికి చిరునామా కవ్వాల్ అడవులు. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో సఫారీ ప్రయాణంతో పర్యాటకులు నేరుగా అటవీ అందాలను, వన్యప్రాణులను చూసి ఆహ్లాదం పొందుతున్నారు. అటవీశాఖ ప్రతీ సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీ ప్రయాణానికి అనుమతి నిలిపివేస్తుంది. తిరిగి అక్టోబర్ 1 నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది గత వారం రోజుల వరకు వర్షాలు ఎక్కువగా కురువడంతో సఫారీకి మరికొంత సమయం పడుతుందని అంతా భావించారు. కానీ మూడు రోజులుగా వర్షాలు పడకపోవడంతో బుధవారం నుంచి సఫారీ ప్రయాణానికి అటవీశాఖ అధికారులు అనుమతినిచ్చారు.
అడవిలో రెండు గంటలు..
జన్నారం అటవీ రేంజ్‌లోని పలు ప్రాంతాలలో సఫారీ ప్రయాణానికి అనుమతి ఉంది. ఈ సఫారీ ప్రయాణం రెండు గంటలు ఉంటుంది. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు, ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడుసార్లు సఫారీ ప్రయాణం ఉంటుంది. ఈ రెండు గంటలు గేట్ నంబర్ 1 నుంచి గొండుగూడ బేస్ క్యాంపు, బైసన్‌కుంట, మైసమ్మ కుంట ప్రాంతాల వరకు తీసుకెళ్తారు. బైసన్‌కుంటలో సేద తీరడానికి, టిఫిన్ చేయడానికి సౌకర్యం కల్పించారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా కనిపిస్తాయి.
పెరిగిన సఫారీ ధరలు
పర్యాటకులను అడవుల్లోకి తీసుకెళ్లడానికి అటవీశాఖ అధికారులు ఐదు సఫారీలను, పర్యాటక శాఖ అధికారులు రెండు సఫారీలను ఏర్పాటు చేశారు. ఈసారి సఫారీ ధరలు గతం కంటే పెరిగాయి. సోమవారం నుంచి గురువారం వరకు ఆరుగురికి రూ. 3500, అదనపు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీకెండ్ రోజుల్లో (శుక్ర, శని, ఆదివారాల్లో) సఫారీ ఆరుగురికి రూ.4000, అదనపు సభ్యుడికి రూ. 500 చొప్పున చెల్లించాలి. కాగా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తగ్గిన హరిత గదుల ధరలు
దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు బస చేయడానికి జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్ గదుల ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ధరలు తగ్గాయి. గతంలో సోమవారం నుంచి గురువారం వరకు ఏసీ గదులు రూ.2016, నాన్ ఏసీ గదులు రూ.1232, డార్మెంటరీ గది రూ.2500లుగా ఉండేవి. వీకెండ్ (శుక్ర, శని, ఆదివారాల్లో) ఏసీ గది రూ.2240, నాన్ ఏసీ రూ.1344, డార్మెంటరీ రూ. 3000 ఉండేవి. జీఎస్టీ తగ్గడంతో ఈ సంవత్సరం ప్రస్తుతం సోమవారం నుంచి గురువారం వరకు నాన్ ఏసీ రూ.1155, ఏసీ రూ.1890, డార్మెంటరీ రూ.2500, వీకెండ్‌లో నాన్ ఏసీ రూ.1260, ఏసీ గదులు రూ. 2100, డార్మెంటరీ రూ.3000గా ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముందుగా టీఎస్‌టీడీసీ అనే వెబ్‌సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.