
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసర: బాసరలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు పదో రోజు మహా సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో బారులుతీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ వైదిక బృందం నవ చండీ హోమం, పూర్ణహుతి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు వేద మంత్రోఛ్ఛరణలతో మధ్య వైదిక బృందం మహాభిషేకము, విశేష అలంకరణ పూజలు చేశారు. సాయంత్రం అర్చకులు చతుషష్టి పూజలు నిర్వహించారు.
నేటి పూజలు..
విజయదశమి గురువారం వేకువ జామున 4 గంటలకు అమ్మవార్లకు మహాభిషేకము, ప్రాతఃకాల చతుషష్టి, శమీపూజ, పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్ తెలిపారు.