TS Mudhole Assembly Constituency: ఎక్కడా లేనంత తీవ్రమైన పోటీ ముధోల్‌లో..
Sakshi News home page

TS Election 2023: ఎక్కడా లేనంత తీవ్రమైన పోటీ ముధోల్‌లో..

Aug 10 2023 7:14 AM | Updated on Aug 10 2023 1:32 PM

TS Mudhole Assembly Constituency - Sakshi

నిర్మల్‌: ముధోల్‌ నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. నియోజకవర్గ రాజకీయ, సామాజిక పరిస్థితులను బట్టి రానున్న ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీ చేసేందుకు కొత్తముఖాలు తెరపైకి వస్తున్నాయి. స్థానిక సీనియర్లతో పాటు ఇతర నియోజకవర్గ నేతలూ ఇక్కడి నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నారు.

రానున్న ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకుంటామంటున్నారు. కొత్తవాళ్లతో పాటు గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన మాజీలూ బరిలో దిగేందుకు సై అంటున్నారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిపై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో సొంతపార్టీ నేతలే ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఏ దిక్కు లేకుండా ఉన్న కాంగ్రెస్‌ కొత్త ముఖాలను రంగంలోకి దింపేందుకు యోచిస్తోంది. బీజేపీలో మాత్రం భిన్నమైన పరిస్థితి. పార్టీ టికెట్‌ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్‌, వేణుగోపాలాచారి కూడా బరిలో దిగే అవకాశాలున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు.

ఖాళీగా కాంగ్రెస్‌..
కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో రాష్ట్రంలోనూ ఒక్కసారిగా కాంగ్రెస్‌ పుంజుకుంది. కానీ.. జిల్లాలో విచిత్రంగా ఏళ్లుగా ఉన్న బలమైన నేతలందరినీ కోల్పోయింది. ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామారావుపటేల్‌ బీజేపీలో చేరారు. చాలామంది సీనియర్లూ వారివెంటే వెళ్లిపోవడంతో కాంగ్రెస్‌ ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ముధోల్‌ నియోజకవర్గం నుంచి ఆనంద్‌రావు పటేల్‌ మాత్రమే సీనియర్‌ నేతగా ఉన్నారు. ముధోల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పటికీ ఖరారు చేయకుండా కాంగ్రెస్‌ వేచిచూసే ధోరణిలో ఉంది. కొందరు కొత్తనేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలో తీవ్ర పోటీ..
బీజేపీ టికెట్‌ కోసం ఎక్కడా లేనంత తీవ్రమైన పోటీ ముధోల్‌లో ఉంది. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిన జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, డీసీసీ అధ్యక్షుడిగా ఉండి కమలదళంలో చేరిన రామారావుపటేల్‌, నియోజకవర్గ సీనియర్‌నేత మోహన్‌రావుపటేల్‌ పార్టీ టికెట్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోటాపోటీగా ఈ ముగ్గురూ గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. వీరితో పాటు ఎన్‌ఆర్‌ఐగా ఉండి వచ్చిన యువనేత బాజీరావు పటేల్‌, బద్దం భోజారెడ్డి కూడా తమ పేర్లను పార్టీ పరిశీలిస్తుందని ఆశిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

‘కారు’లో కిరికిరి..
ఎన్నికలు సమీపిస్తున్నవేళ హ్యాట్రిక్‌ కొడదామన్న ఆశల్లో ఉన్న బీఆర్‌ఎస్‌కు సొంతపార్టీలోనే అసమ్మతి పెరుగుతుండటం మింగుడు పడటం లేదు. పార్టీకి తాము వ్యతిరేకం కాదని, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని మాత్రం మార్చాలని సదరు అసమ్మతి నేతలు కొత్త రాగం వినిపిస్తున్నారు. ప్రస్తుత, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, కొందరు సీనియర్‌ నాయకులు ఈ అసమ్మతి వర్గంలో ఉండటం గమనార్హం. వీరందరూ ఇటీవల పార్టీ రాష్ట్ర నేతలను కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేశారు. అలాగే మండలాల వారీగా తిరుగుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీరి వెనుక ఎవరున్నారన్న చర్చ నియోజవర్గంలో కొనసాగుతోంది. ఏదిఏమైనా మళ్లీ ఎమ్మెల్యేగా విఠల్‌రెడ్డి గెలుస్తారని ఆయన వర్గం చెబుతోంది.

రాజేశ్‌బాబు:
ముధోల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌నేతగా పేరున్న ప్రస్తుత భైంసా ఏఎంసీ చైర్మన్‌ జాదవ్‌ రాజేశ్‌బాబు ఈసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వని పక్షంలో రెండోపేరుగా తనను పరిశీలనలోకి తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఇక అసెంబ్లీలో ఓడినా.. తను ముందునుంచీ ఆశిస్తున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇది అనుభవంగా మారుతుందన్న యోచనలో ఉన్నారు.

తుల అరుణ్‌కుమార్‌:
బోథ్‌ నియోజకవర్గానికి చెందిన దివంగత సీనియర్‌ నేత తుల సుభాష్‌ తనయుడు తుల అరుణ్‌కుమార్‌కు ఈసారి ముధోల్‌ టికెట్‌ ఇవ్వాలన్న యోచన కాంగ్రెస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బోథ్‌ ఎస్టీ నియోజకవర్గం కావడంతో అక్కడ ఆయన పోటీచేసే పరిస్థితి లేదు. దానికి తోడు ఆయన సామాజికవర్గమైన మున్నూరుకాపులు ముధోల్‌ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు ముధోల్‌లో కాంగ్రెస్‌కంటూ పెద్దదిక్కు లేకపోవడంతో అరుణ్‌ పేరును ఇక్కడి నుంచి పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

డా.కిరణ్‌కుమార్‌:
కిరణ్‌ ఫౌండేషన్‌ పేరిట ఇప్పటికే ముధోల్‌ నియోజకవర్గంలో సేవలు చేస్తున్న డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. ఇటీవల శ్రీహరిరావుతో కలిసి ఆయన హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు. అవకాశమిస్తే ముధోల్‌ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమంటున్నారు.

విజయ్‌కుమార్‌రెడ్డి:
గతంలో పీఆర్పీ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఎన్‌ఆర్‌ఐ విజయ్‌కుమార్‌రెడ్డి ఈసారి పోటీకి రెడీ అవుతున్నారు. తెలంగాణ ఉ ద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన ప్ర స్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఈ సారి ఆయన కూడా పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement