
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉంటూ, రెండంతస్థుల భవనంలో వెస్ట్ ఆర్కిటికా, సబోర్గా, పౌల్వియా, లాడోనియా తదితర నకిలీ దేశాల రాయబార కార్యాలయాలను నిర్వహిస్తున్న హర్ష్ వర్ధన్ జైన్‌ను ఇటీవల ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. ఈ నేపధ్యంలో ఆయన సాగించిన అనేక బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి.
47 ఏళ్ల ఈ మోసగాడు దౌత్యపరమైన ప్లేట్లు కలిగిన లగ్జరీ కార్లలో తిరిగాడు. దశాబ్ద కాలంలో 162 విదేశాల్లో పర్యటించాడు. రూ. 300 కోట్ల ఆర్థిక కుంభకోణాన్ని నడిపాడని ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇంతకీ కొత్త దేశాన్ని ఎలా సృష్టిస్తారు? ఇందుకు ఏ విధమైన రూపకల్పన చేస్తారు? దేశ జెండాలు, పాస్‌పోర్ట్‌లు, రాజ్యాంగాలు, జాతీయ గుర్తింపులను ఎలా సృష్టిస్తారు.. అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఒక స్వతంత్ర దేశాన్ని ఎలా ఏర్పాటు చేయాలని విషయంలోకి వెళదాం.
మోంటెవీడియో కన్వెన్షన్ ప్రకారం ఒక దేశానికి నాలుగు లక్షణాలు అవసరం. ఎవరూ హక్కుదారులుకాని భూభాగం, శాశ్వత జనాభా, అధికార ప్రభుత్వం, దౌత్యంలో పాల్గొనే సామర్థ్యం అనేవి తప్పనిసరి. అయితే ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేకపోతే ఆ దేశానికి గుర్తింపు దక్కదు. అయినప్పటికీ ఇటువంటి దేశాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. 2019లో భారత్ విడిచి పారిపోయిన అత్యాచార నిందితుడు నిత్యానంద కొంతకాలానికి తెరపైకి వచ్చి, తాను ఒక కొత్త దేశాన్ని స్థాపించానని, దానికి యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టానని తెలిపాడు. ఈ దేశం ఏర్పాటుకు తన అనుచరులు ఈక్వెడార్ సమీపంలో భూమిని కొనుగోలు చేశారని నిత్యానంద తెలిపారు. అయితే అది వాస్తవానికి ఎక్కడ ఉందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.
నిత్యానంద వాదనను ఈక్వెడార్ తిరస్కరించింది. తమ గడ్డపై లేదా సమీపంలో అలాంటి దేశం ఏదీ లేదని స్పష్టం చేసింది. అయితే నిత్యానంద మాత్రం తన దేశం పేరుతో కైలాస వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్, దౌత్య మిషన్లు, సొంత పాస్‌పోర్ట్‌లు, కరెన్సీని జారీ చేశారు. 2023 ఫిబ్రవరిలో నిత్యానంద సహాయకురాలు విజయప్రియ జనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నప్పుడు కైలాస దేశం అందరి దృష్టిని ఆకర్షించింది. కైలాస దేశం ప్రపంచంలోని పలు దేశాలలో తన రాయబార కార్యాలయాలను ప్రారంభించిందని ఐక్యరాజ్య సమితిలో విజయప్రియ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా, స్వయం ప్రకటిత సూక్ష్మదేశాలు చాలానే ఉన్నాయి. 1967లో పాడీ రాయ్ బేట్స్ బ్రిటిష్ సైనిక వేదిక అయిన సీలాండ్‌ను ఆక్రమించి, ఒక దేశంగా ప్రకటించాడు. దానికి ఒక జెండా, రాజ్యాంగం రూపొందించాడు. పాస్‌పోర్ట్‌లను కూడా జారీ చేశాడు. అయితే నేటికీ ఎవరూ సీలాండ్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించ లేదు. ఇదేవిధంగా చెక్ రిపబ్లిక్ నేత వీటీ జెడ్లికా 2015లో లిబర్‌ల్యాండ్‌ను స్వేచ్ఛావాద కలల దేశంగా ప్రకటించాడు. అయితే నేటికీ దీనికి గుర్తింపు లేదు. ఏది ఏమైనప్పటికీ దేశ నిర్మాణం అంత తేలికైన పనేమీ కాదు.