
అక్షరజ్ఞానం అనేది అజ్ఞానాన్ని తరిమికొట్టి, విజ్ఞానాన్ని అందిస్తుంది. నేడు(సెప్టెంబర్ 8) అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. అక్షరాస్యత అనేది అక్షరాలను నేర్చుకోవడానికి మించి మనిషికి గౌరవాన్ని, అవకాశాలను అందించే సమున్నత వేదిక. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం- 2025 థీమ్ ‘పరివర్తన చెందుతున్న ప్రపంచానికి అక్షరాస్యత’. వేగంగా మారుతున్న నేటి యుగంలో డిజిటల్, ఆర్థిక క్రియాత్మక అక్షరాస్యత అవసరాన్ని ఈ దినోత్సవం స్పష్టం చేస్తుంది.
దేశం పురోగతి చెందుతున్నప్పటికీ లక్షలాది మంది ప్రజలు నేటికీ అక్షరాస్యతకు దూరంగానే ఉన్నారు. అక్షరాస్యతను యునెస్కో మానవ హక్కుగా, జీవితాంతం నేర్చుకోవడానికి అవసరమైనదిగా అభివర్ణించింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని యునెస్కో 1966, అక్టోబర్ 26 తన 14వ సర్వసభ్య సమావేశంలో ప్రకటించింది. మరుసటి సంవత్సరం 1967లో ప్రపంచం మొట్టమొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సమయంలో ప్రపంచ జనాభాలో సగానికి పైగా నిరక్షరాస్యులున్నారు.
నేడు ప్రపంచ జనాభాలో 86 శాతం కంటే ఎక్కువ మంది చదవగలరు. రాయగలరు. అయినప్పటికీ లక్షలాది మంది ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాలవారికి ప్రాథమిక అక్షరాస్యత అందుబాటులో లేని పరిస్థితులున్నాయి. ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యత లేకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ పెరుగుదల అత్యవసరాలుగా మారిపోయాయి. పేదరికాన్ని తగ్గించడం, లింగ సమానత్వాన్ని సాధించడం కోసం అక్షరాస్యత అనేది కీలకంగా ఉంది. ఇది లేనిపక్షంలో పురోగతి అసాధ్యమని నిపుణులు చెబుతుంటారు.