
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా ఢిల్లీకి ఆనుకునివున్న యమునా నదిలో 63 ఏళ్ల రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 4 మధ్యాహ్నం ఒంటి గంటకు యమునా నది నీటిమట్టం 207 మీటర్ల మార్కును దాటింది. రాత్రి 10 గంటల సమయానికి, ఇది 207.43 మీటర్లకు పెరిగింది. 1963 తర్వాత యమునా నది నీటి మట్టం ఈ స్థాయికి చేరడం ఇది మూడవసారి.
ఈ వరదల కారణంగా ఢిల్లీలోని రింగ్ రోడ్డు, సివిల్ లైన్స్, బేలా రోడ్డు, సోనియా విహార్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. 12 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం గురువారం నాటికి నీటిమట్టం 207.48 మీటర్లకు చేరే అవకాశం ఉంది. ఇది 1978లో వచ్చిన చారిత్రక వరద స్థాయిలకు ఇది చాలా దగ్గరగా ఉంది. వరద నీరు కారణంగా మజ్ను కాటిల్లా, సలీంగర్ బైపాస్ మధ్య ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిగంబోధ్ ఘాట్, గీతా కాలనీలోని దహన సంస్కారాలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిలిపివేసింది. జైత్‌పూర్‌లోని విశ్వకర్మ కాలనీ, సివిల్ లైన్స్ మొనాస్టరీ మార్కెట్లలోకి వరద నీరు చేరింది.
వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ అమోల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ వరదల ముప్పు నుంచి 12 వేల మందిని మందిని రక్షించినట్లు తెలిపారు. బాధితుల కోసం 38 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. హిమాలయాలలోని ఎగువ యమునా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 1.6 లక్షల క్యూసెక్కుల నీరు, రాత్రి 7 గంటలకు 1.78 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాధారణంగా ఈ బ్యారేజ్ నుండి 50 వేల క్యూసెక్కుల కంటే తక్కువ నీరు మాత్రమే విడుదల అవుతుంటుంది. ఇలానే భారీ వర్షాలు కొనసాగితే ఢిల్లీకి ముప్పు తప్పదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తోంది.